పెరిగిన పెద్ద హనుమంతుడు

పెరిగిన పెద్ద హనుమంతుడు
హనుమంతుడు తీసుకున్న నిర్ణయాలు ... చేసిన చేష్టలు రామాయణంలో ఆసక్తికరంగా కనిపిస్తూ వుంటాయి. హనుమంతుడు తాను తలచుకున్నప్పుడు సూక్ష్మ రూపాన్ని ... అవసరమైనప్పుడు స్థూలరూపాన్ని ధరించే వరాన్ని పొందుతాడు. ఈ కారణంగానే ఆయన లంకా పట్టణంలోకి సూక్ష్మరూపంలో ప్రవేశిస్తాడు. అక్కడ రాక్షసులను ఎదుర్కునే పరిస్థితుల్లో స్థూలరూపాన్ని ధరించి అంతా అల్లకల్లోలాన్ని సృష్టిస్తాడు.

పోతన భాగవతాన్ని రాజభటులు బలవంతంగా తీసుకువెళ్లడానికి వచ్చినప్పుడు కూడా ఆయన సూక్ష్మరూపంలో ఆ గ్రంధాన్ని కాపాడుతూ, స్థూలరూపంలో రాజభటులను తరిమికొడతాడు. ఇదే విధంగా ఆయన తన సూక్ష్మ ... స్థూల రూపాలను ఆవిష్కరించిన తీరు కర్నూలు జిల్లా నద్యాలలో దర్శనమిస్తుంది. వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఇక్కడి ఆలయంలోనే మహిమాన్వితమైన మారుతి కనిపిస్తాడు.

పూర్వం ఇక్కడి కుముద్వతీ నదీ తీరంలో ఓ జాలరికి చిన్న పరిమాణం గల హనుమంతుడి ప్రతిమ దొరికింది. చూడముచ్చటగా వున్న ఆ విగ్రహం తనకి లభించడం తన అదృష్టంగా భావించిన ఆ జాలరి, దానిని తన ఇంటికి తీసుకు వెళ్లి ప్రతి నిత్యం ఆరాధించసాగాడు. కొన్ని రోజుల తరువాత ఆ విగ్రహం పెరుగుతూ వుండటం ఆయన గమనించాడు. ఆ రోజు నుంచి ఆ విగ్రహం మరింత వేగంగా పెరగడం ప్రారంభించింది. దాంతో ఈ విషయాన్ని ఆయన గ్రామస్తుల దృష్టికి తీసుకువెళ్లాడు.

స్వామివారికి ఆలయం నిర్మించకపోవడమే అందుకు కారణమని భావించి, సహాయ సహకారాలతో ఆ పనిని పూర్తి చేశారు. మంత్రపూర్వకంగా స్వామివారిని ఆలయంలో ప్రతిష్ఠించిన నాటి నుంచే విగ్రహంలో పెరుగుదల ఆగిపోయిందని చెబుతారు. భారీ ఆకారంలో కొలువైన ఇక్కడి స్వామిని చూడగానే, స్థలపురాణంగా వినిపిస్తోన్న కథ నిజమేననిపిస్తుంది. మహిమాన్వితమైన ఇక్కడి స్వామిని పూజించడం వలన, అనుకున్న పనులు ఆయన అనుగ్రహంతో పూర్తవుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles