పిల్లి ఎదురొస్తే ఇబ్బందులు తప్పవా ?

పిల్లి ఎదురొస్తే ఇబ్బందులు తప్పవా ?
శకునాలను ... వాటి ఫలితాలను భారతీయులు ఎంతగానో విశ్వసిస్తుంటారు. శుభకార్యాల నిమిత్తం బయలుదేరుతున్నప్పుడు ... శుభకార్యాలకి సంబంధించిన పనులను ప్రారంభిస్తూ వున్నప్పుడు సహజంగానే శకునం చూసుకుంటూ వుంటారు. శకునం మంచిగా అనిపించకపోతే శుభకార్యాలను వాయిదా వేయడమే కాదు, రద్దు చేయడం కూడా జరుగుతూ వుంటుంది. అంతగా శకునాలను నమ్ముతూ వుండటం జరుగుతూ వుంటుంది.

ఈ శకునాల్లో పిల్లి శకునం మరింత ప్రభావం చూపుతుందని భావిస్తూ వుంటారు. పెంపుడు పిల్లికి తప్పులేదనే విశ్వాసం వుండటం వలన, తమ పిల్లి కాకుండా మరో పిల్లి ఎదురుపడితే దానిని శకునంగానే భావిస్తుంటారు. శుభకార్యాల నిమిత్తం బయలుదేరినప్పుడు హఠాత్తుగా ఓ పిల్లి ఎదురొచ్చి ప్రదక్షిణంలా చుట్టూ తిరిగి వెళితే, వెంటనే ఆ ప్రయాణం మానుకోవాలని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే ఈ విధమైన శకునం వలన కార్యహాని జరుగుతుంది.

అలాగే రెండు పిల్లులు కొట్టుకుంటూ కనిపిస్తే, తలపెట్టె కార్యంలో కలహాలు మొదలవుతాయని గ్రహించాలి. ఇక పిల్లి తన పిల్లలను ఏడు ఇళ్లు మారుస్తూ వుంటుంది. ఈ క్రమంలో అది తన పిల్లలను నోటకరచుకుని ఎదురురావడం వలన కూడా బయలుదేరిన పనులు విఫలమవుతాయి. ఇక కుక్కలు తరుముతుండగా భయపడి పరిగెత్తుకు వచ్చే పిల్లి అసలు ఎదురుపడకూడదు. దీని వలన అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతుంటాయి.

శుభకార్యాల నిమిత్తం బయలుదేరుతున్నప్పుడు పిల్లి ఒకానొక విధంగా మాత్రమే ఎదురు రావడం మంచిదని శాస్త్రం చెబుతోంది. ఎలుకను చంపి .. చచ్చిన ఎలుకను నోటకరచుకుని పిల్లి ఎదురుపడితే అది శుభ సూచకంగా భావించాలి ... కార్యసిద్ధి జరుగుతుందని గ్రహించాలి. మిగతా సందర్భాల్లో ఇబ్బందులు తప్పవని శాస్త్రం స్పష్టం చేస్తోంది గనుక, ప్రయాణం వాయిదా వేసుకుని .. ఆ తరువాత ఆరంభించడం అన్ని విధాలా మంచిది.

More Bhakti Articles