సంతోషాలు తెచ్చే సంక్రాంతి

 సంతోషాలు తెచ్చే సంక్రాంతి
అందరినీ ఒకచోట చేర్చేది పండుగ ... అందరినీ ఒక్కటిగా చేసేది పండుగ. అలాంటి తెలుగు పండుగలలో పెద్ద పండుగ అనే విశిష్టతను సంక్రాంతి పండుగ దక్కించుకుంది. భోగి .. సంక్రాంతి ... కనుమ ... ముక్కనుమలలో దేనిప్రత్యేకత దానికి ఉన్నప్పటికీ, ఈ నాలుగు రోజులను కలిపి ఒకే పండుగలా భావిస్తూ వుంటారు. సాధారణంగా మన పండుగలు చాంద్రమానం ప్రకారం జరపబడుతూ వుంటాయి. కానీ సంక్రాంతి మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటూ వుంటాం.

సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణమనీ, మకర సంక్రాంతి అని అంటారు. సంక్రాంతి పాడిపంటలతో ముడిపడిన పండుగ ... అందుకే ఇది పల్లెటూళ్లలో ఎక్కువగా తన ప్రభావాన్ని చూపిస్తూ వుంటుంది. రైతుల కష్టం ఫలించి వారి కలలు నిజం చేసే పండుగ ఇది. ఈ రోజున అందరూ అభ్యంగన స్నానమాచరించి కొత్త బట్టలు ధరిస్తారు. ఈడొచ్చిన ఆడపిల్లలు అందంగా దిద్దే రంగవల్లికలతో ... గొబ్బెమ్మలతో ప్రతి వాకిలి కళకళలాడుతూ వుంటుంది.

ఇక మరికొందరు యువతులు బొమ్మలకొలువు ఏర్పాటు చేయడంలో నిమగ్నమై వుంటారు. మగపిల్లలు ఎగరేసే గాలిపటాలు మేఘాల చాటున గుసగుసలు చెప్పుకుంటూ వుంటాయి. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లల కోసం, అత్తింటికి వచ్చిన అల్లుళ్ల కోసం అరిసెలు ... సకినాలు .. జంతికలు ... వేడివేడిగా తయారు చేయడంలో మహిళలు తీరికలేకుండా వుంటారు. ఇక పురుషులలో కొందరు కోడి పందాల్లో ... మరి కొందరు కోలాటాల్లో తమ ఆసక్తిని ప్రదర్శిస్తూ వుంటారు.

ఇక రైతుల ఇంటికి ధాన్యం చేరి వుంటుంది గనుక, హరిదాసులు ... గంగిరెద్దులను ఆడించే వాళ్లు దానాన్ని కోరుతూ వాకిట్లోకి వస్తుంటారు. ఈ రోజున ధాన్యంతో పాటుగా పెరుగును కూడా దానం చేయాలని అంటారు. అలాగే ఈ రోజున నువ్వులు ... బెల్లం ... గుమ్మడి కాయలను దానం చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. సంక్రాంతి రోజున పరమశివుడిని నెయ్యితో అభిషేకించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.

సంక్రాంతికి పుట్టినిల్లు పల్లెటూరే. సంపదలు ... సంబరాలు ఆత్మీయంగా పెనవేసుకుపోయేది ఇక్కడే. అందుకే ఇక్కడ జరుపుకునే సంక్రాంతికే సార్ధకత లభిస్తుంది. సంక్రాంతి అంటే అయినవారితో కలిసి అందుకునే అమృతం లాంటిదనీ ... పరిచయమున్నవారితో కలిసి పంచుకునే పాయసం లాంటిదనే విషయం బోధ పడుతుంది.

More Bhakti Articles