తలనీలాలు సమర్పించడంలో అర్థం

తలనీలాలు సమర్పించడంలో అర్థం
కుటుంబంలో ఎవరికి ఏ ఆపద కలిగినా ... ఎలాంటి కష్టం కలిగినా, ఆ గండం గడిస్తే తలనీలాలు సమర్పిస్తామని మిగతా కుటుంబ సభ్యులు మొక్కుకుంటూ వుంటారు. ఆ గండం నుంచి సదరు వ్యక్తి బయటపడగానే, అందరూ కలిసి అనుకున్న క్షేత్రానికి వెళ్లి తలనీలాలు ఇచ్చేసి వస్తుంటారు. అయితే చాలామంది తలనీలాలు ఇవ్వడమనేది పేదవారు చెల్లించే మొక్కుగా భావిస్తుంటారు. తమ తాహతుకి తగిన విధంగా ఖరీదైన కానుకలు సమర్పించుకుంటామని అనుకుంటారు.

ముందుగా అనుకున్న విధంగా తాము ఖరీదైన వస్తు సామాగ్రిని దైవానికి సమర్పించాం గనుక, ఇక తలనీలాలు ఇవ్వవలసిన అవసరం లేదని వెళుతుంటారు. అయితే పుణ్యక్షేత్ర దర్శనం చేసినప్పుడు తప్పనిసరిగా దైవానికి తలనీలాలు ఇవ్వాలని శాస్త్రం చెబుతోంది. పేద .. ధనిక అనే భేదం లేకుండా తలనీలాలు ఇవ్వవలసి ఉంటుందని అంటోంది. ఎవరైనా సరే తెలిసో తెలియకో కొన్ని పాపాలు చేయడం ... కొన్ని పనుల కారణంగా దోషాలు మూటగట్టుకోవడం జరుగుతుంటుంది.

ఆ పాపాలన్నీ కూడా కేశముల (జుట్టు) చివరలు పట్టుకుని వేలాడుతూ వుంటాయి. అలా పాపాలు జుట్టుని పట్టుకుని ఉన్నంతవరకూ, మనఃశాంతి దూరమై చిరాకులతో కూడిన జీవితాన్ని గడుపుతుంటారు. సమస్త పాపాలకు నిలయంగా వుండే జుట్టు, అందాన్నిస్తూ వుండటం వలన ఆ జుట్టుని అందరూ అపురూపంగా చూసుకుంటూ వుంటారు. సహజంగానే ప్రతి ఒక్కరికీ తమ జుట్టుపట్ల ఒకరకమైన మమకారం ... వ్యామోహం ఏర్పడతాయి. దీని కారణంగా అందమంటే తమదేననే బలమైన నమ్మకం ఏర్పడుతుంది.

ఆ జుట్టు తీయగానే అప్పటివరకూ వున్న అందం ఏమైపోయిందనే ఆశ్చర్యం కలుగుతుంది. తమ అందం ఒక భ్రమ ... భగవంతుడి సౌందర్యం నిజం అనే విషయం స్పష్టమవుతుంది. అహంకారం అజ్ఞానాన్ని కప్పివుంచుతుందనే సత్యం బోధ పడుతుంది. అందువల్లనే అహంకారానికి ఆభరణంలా కనిపించే జుట్టును తీసివేయాలని శాస్త్రం చెబుతుంది. జుట్టుతో పాటు పాపాలు వదిలించుకున్న తమని పునీతులను చేయమని దైవాన్ని ప్రార్ధించడమే తలనీలాలు సమర్పించడంలోని అర్థం ... పరమార్థం.

More Bhakti Articles