సర్పదోష నివారణ క్షేత్రం

సర్పదోష నివారణ క్షేత్రం
జీవితంలో ఆశించిన అభివృద్ధి ... ఆనందం లేకపోవడం, చర్మసంబంధమైన వ్యాధులు వేధిస్తూ వుండటం ఎవరినైనా మానసికంగా కుంగదీస్తూ వుంటుంది. అందుకు కారణం 'సర్పదోషం' అని తెలియగానే కంగారుపడిపోతుంటారు. ఆ దోష నివృత్తికి అవసరమైన ప్రయత్నాలు చేయడం మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో ఏ క్షేత్రాన్ని దర్శించడం వలన ఎక్కువ ఫలితం ఉంటుందనే ఆలోచన చేస్తుంటారు.

అలాంటివారికి 'శ్రీ క్షేత్ర ముక్తి నాగ' ఒక ఆశా కిరణంలా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎంతో విశిష్టమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం బెంగళూరు సమీపంలో దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో అడుగుపెట్టగానే, నాగలోకంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. అంతగా ఇక్కడ అనేక నాగదేవతా ప్రతిమలు కొలువుదీరి కనిపిస్తూ వుంటాయి. ఇక్కడి గర్భాలయంలోకి చూడగానే గుండె ఝల్లుమంటుంది.

పీఠ భాగాన్ని కలుపుకుని 12 అడుగుల ఎత్తు ... 7 పడగలు గల నాగదేవత ప్రతిమ గర్భాలయంలో దర్శనమిస్తుంది. నల్లరాతితో మలచబడిన ఈ విగ్రహంలో దైవత్వం ఉట్టిపడుతూ వుంటుంది. సర్పదోషం కారణంగా ఇబ్బందులు పడుతోన్న భక్తులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. నాగదేవతను దర్శించుకుని, శాంతి హోమాలు చేయించుకుంటూ వుంటారు.

ఇక్కడి నాగదేవత మహిమాన్వితమైనదనీ, సర్పదోష బాధల నుంచి వెంటనే విముక్తిని ప్రసాదిస్తుందని చెబుతుంటారు. నాగదేవత చూపిన మహిమలు అనేకం ఇక్కడ ఆధారాలతో సహా కనిపిస్తాయి. 'సుబ్రహ్మణ్య షష్ఠి' ని ఇక్కడ ఘనంగా జరుపుతుంటారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. నాగదేవతను దర్శించి ... పూజించి తరిస్తుంటారు.

More Bhakti Articles