పుష్య మాస ప్రత్యేకత

పుష్య మాస ప్రత్యేకత
పౌర్ణమి రోజుకి చంద్రుడు పుష్యమి నక్షత్రంలోవుండటం వలన ఈ మాసానికి 'పుష్యమాసం' అనే పేరు వచ్చింది. చాంద్రమానాన్ని అనుసరించి పదో నెలగా పిలవబడే ఈ పుష్యమాసానికి ఎంతో ప్రత్యేకత వుంది. అహర్నిశలు రైతులు పడిన శ్రమకి ఫలితంగా ఈ నెలలోనే వారి ఇళ్లకు పంటలు చేరతాయి. తమ కష్టానికి ప్రతిఫలంగా కనిపించే పంటను చూసి రైతులు పడే ఆనందం అంతా ఇంతా కాదు.

ఈ పంటలను దృష్టిలో పెట్టుకుని రైతులు భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ వుంటారు. అవి నిజం కాబోతున్నందుకు వాళ్లు ఎంతగానో సంతోషిస్తుంటారు. అందువలన వాళ్లు పుష్యమాసాన్ని తమకి అదృష్టాన్ని తెచ్చే మాసంగా ... ఆనందాలని ఇచ్చే మాసంగా భావిస్తూ ఆహ్వానం పలుకుతుంటారు.

ఈ మాసంలోనే తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే 'సంక్రాంతి' పండుగ ప్రజలను పలకరిస్తుంది. 'భోగి' ... 'సంక్రాంతి' ... 'కనుమ' ... 'ముక్కనుమ'లను కలుపుకుని కనువిందుగా జరిగే ఈ పెద్ద పండుగ ఎంతో సందడి చేస్తుంది. పుట్టింటికి అతిథిలా వచ్చే ఆడపిల్లలతో ... అత్తమామల ఇంటికి చేరే కొత్త అల్లుళ్లతో ఈ పండుగ ఆత్మీయానురాగాలు ఫలించే వేదికలా కనిపిస్తుంది.

ఇక గోదాదేవి - రంగనాయకస్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగేది ఈ మాసంలోనే. అలాగే ఈ మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం పరమశివుడి జన్మ నక్షత్రంగా చెప్పబడుతోంది. ఈ మాసంలో .. అంటే సంక్రాంతి నుంచే 'ఉత్తరాయణ పుణ్యకాలం' మొదలవుతుంది. సూర్యుడు సంక్రాంతి రోజు నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే వరకూ గల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా చెబుతుంటారు.

ఈ సమయం ఎంతో శుభప్రదమైనదిగా చెప్పబడుతోంది. ఈ కారణంగానే ఈ సమయంలో వివిధ రకాల శుభకార్యాలు నిర్వహిస్తుంటారు. అటు విష్ణుమూర్తి ... ఇటు సంక్రాంతి లక్ష్మీ, ఓ వైపున మహా శివుడు ... మరో వైపున ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందించే పవిత్రమైన మాసంగా పుష్యమాసం విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది.

More Bhakti Articles