పుణ్య ఫలాల నిచ్చే వృక్షాలు

పుణ్య ఫలాల నిచ్చే వృక్షాలు
మానవ జన్మకి ముందు చెట్టుగా ఆవిర్భవించడం జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ వృక్షాల రూపంలో వున్నది మన పూర్వీకులే కావచ్చు అనే ఉద్దేశం కారణంగానే చాలా మంది చెట్లు కొట్టడానికి ఇష్టపడరు. చల్లని నీడనే కాదు, ఫలాలు ... పత్రాలు ... బెరడు ... కలప ... ఇలా చెట్లు ఇచ్చే ప్రతి ఒక్కటి మానవులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటూవుంటాయి. అంతే కాకుండా పక్షులకు చెట్లు ఆశ్రయమిస్తూ, వాటి సంతానాన్ని కూడా సంరక్షిస్తూ వుంటాయి.

అలాంటి చెట్లు పెంచడం వలన అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని అంటారు. చెట్లు నాటడం వలన అవి పెరిగి పెద్ద కావడానికీ, అవసరాలు తీర్చడానికి చాలాకాలం పడుతుంది. ఈ కారణంగానే తమ అవసరానికి రాని చెట్లను పెంచడం ఎందుకనే ఉద్దేశంతో కొంతమంది ఈ విషయం పట్ల పెద్దగా ఆసక్తి కనబరచరు. మరి కొందరేమో భవిష్యత్తు తరాలవారి ఆకలిని తీర్చాలి ... చల్లని నీడని ఇవ్వాలనే ఉద్దేశంతో రహదారుల పక్కన కూడా మొక్కలు నాటుతుంటారు.

ఈ విధంగా పదిమందికి ఉపయోగపడేలా మొక్కలు పెంచడం వలన అవి పెరిగి, ముందు తరాల వారికి చల్లని నీడ నిస్తాయి. ఫలాలతో పాటు ఆరోగ్యానికి అవసరమైన ఔషధాలను కూడా ఇస్తాయి. ఒక చెట్టుకింద నీడలో ఎంతమంది సేదదీరుతూ ఉంటారో .. ఎంతమంది ఆ చెట్టు ఫలాలతో ఆకలి తీర్చుకుంటారో ... ఆరోగ్య పరంగా ... గృహ అవసరాల పరంగా ఆ చెట్టు ఎందరికి ఉపయోగపడుతుందో వాళ్లందరి పుణ్య రాశిలోని కొంతభాగం ఆ చెట్టు నాటిన వ్యక్తికి చెందుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఈ విధంగా చెట్లు పెంచడం వలన ఆర్జించిన పుణ్యం కారణంగా వాళ్ల పితృ దేవతలకి సైతం సద్గతులు కలుగుతాయని చెప్పబడుతోంది. చెట్ల వలన రుచికరమైన ఫలాలు మాత్రమే కాదు, మోక్షానికి అర్హత సంపాదించి పెట్టె పుణ్యఫలాలు కూడా లభిస్తాయనే విషయాన్ని అందరూ గ్రహించాలి.

More Bhakti Articles