ఖడ్గ ఆంజనేయుడు

ఖడ్గ ఆంజనేయుడు
సాధారణంగా హనుమంతుడు వివిధ నామాలతో ... అనేక భంగిమలతో దర్శనమిస్తూ వుంటాడు. ఇక హనుమంతుడు కూర్చుని వున్నా ... నిలబడి వున్నా ఆయన ఆయుధంగా పక్కనే 'గద' కనిపిస్తూనే వుంటుంది. ఆయన దేహ ధారుడ్యానికి ... పరాక్రమానికి 'గద' ఒక సహజమైన అలంకారంగా అనిపిస్తూ వుంటుంది.

అలాంటి 'గద' కాకుండా ఆయన చేతిలో మరే ఆయుధం కనిపించినా వింతగా ... విచిత్రంగా అనిపిస్తూ వుంటుంది. అలా ఆశ్చర్యచకితులను చేసే హనుమంతుడు మనకి కృష్ణా జిల్లా 'మొవ్వ'లో కనిపిస్తాడు. అందుకు కారణం ఇక్కడ హనుమంతుడి చేతిలో 'గద' కాకుండా 'వీర ఖడ్గం ' ఉండటమే. కృష్ణా జిల్లా 'మొవ్వ' అనగానే క్షేత్రయ్య గుర్తుకు రావడం సహజం. ఈ క్షేత్రంలో ఆవిర్భవించిన వేణుగోపాలస్వామి పైనే క్షేత్రయ్య పదాలను రచించి పరవశింపజేశాడు.

అలాంటి ఈ క్షేత్రంలోనే ప్రాచీనకాలం నాటి హనుమంతుడు కూడా దర్శనమిస్తూ వుంటాడు. చాలా ఆలయాల్లో వుండే హనుమంతుడి విగ్రహాలకి ... ఈ విగ్రహానికి ఎంతో తేడా వుంటుంది. పరిమాణం రీత్య విగ్రహం చిన్నదే అయినా, మహా విశిష్టమైనదనే విషయం స్పష్టంగా తెలిసిపోతూ వుంటుంది. ఎక్కడా చూడని విధంగా ఇక్కడ హనుమంతుడు ఖడ్గాన్ని చేతబట్టి దర్శనమిస్తూ వుంటాడు.

అందుకు గల కారణంగా ఇక్కడ ఎన్నో ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తూ వుంటాయి. ప్రతి మంగళవారం స్వామివారిని దర్శించి అభిషేకాలు ... ఆకుపూజలు జరిపించే వారి సంఖ్య ఎక్కువగానే వుంటుంది. ఇక్కడి స్వామిని పూజించడం వలన శత్రుభయం నశిస్తుందనీ, విజయాలు ... సంపదలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles