ఆధ్యాత్మిక చరిత్రకు ఆనవాళ్లు

ఆధ్యాత్మిక చరిత్రకు ఆనవాళ్లు
శ్రీకృష్ణదేవరాయలు తన పరిపాలనా కాలంలో విజయాలకు ... సంపదలకు మాత్రమే కాదు, సంగీత సాహిత్యాలకు ... శిల్పకళకు ... ఆధ్యాత్మికతకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చాడు. ఈ కారణంగానే ఈ రోజున ఏ పుణ్య క్షేత్రానికి వెళ్లినా, అప్పట్లో ఆయన నిర్మించిన గోపురమో ... మంటపమో దర్శనమిస్తూ వుంటుంది. ఇటు వైష్ణవ క్షేత్రాలు ... అటు శైవ క్షేత్రాల నిర్మాణానికి ... పునరుద్ధరణకు కృష్ణదేవరాయలు చేసిన కృషి అంతా ఇంతా కాదు.

ఆనాటి ఆ నిర్మాణాలు ఆయన భక్తి శ్రద్ధలకు నిదర్శనంగానే కాదు, ఆధ్యాత్మిక చరిత్రకు ఆనవాళ్లుగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిలో 'హంపి' ఒకటిగా చెప్పుకోవచ్చు. హంపి అనేక దేవాలయాల సముదాయంగా దర్శనమిస్తూ వుంటుంది. రామాయణంలోని కొన్ని ఘట్టాలు ఈ ప్రదేశంలోనే జరిగాయని చరిత్ర చెబుతోంది. ఈ కారణంగానే ఈ ప్రాంతం మరింత విశిష్టతను సంతరించుకుందని చెబుతుంటారు.

ఇక్కడ ప్రధాన దైవమైన విరూపాక్షస్వామితో పాటు ఇతర దేవతామూర్తుల ఆలయాలు కూడా అలనాటి చరిత్రను అందంగా దోసిట్లో పట్టి అందిస్తుంటాయి. అలాంటి వాటిలో 'హజారా రామాలయం' ... 'కృష్ణాలయం' ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. శ్రీ కృష్ణ దేవరాయల కాలంనాటి శిల్పకళను గురించి తెలుసుకోవాలనుకునే వారు హజారా రామాలయం దగ్గర నుంచి కదలలేరు. అంత అద్భుతంగా ఇక్కడి ప్రాకారాలపై గల శిల్పకళ ఆకట్టుకుంటుంది.

అప్పట్లో నగరంలోకి ఎవరు ప్రవేశించాలన్నా ఈ దారిగుండా రావలసిందే. అందువల్ల నగరంలో ప్రవేశించే కొత్త వ్యక్తులు ... వాళ్ల కదలికలను ఈ ఆలయం దగ్గర మారువేషాల్లో కూర్చున్న రాజభటులు గమనిస్తూ ఉండేవారట. ఈ ప్రదేశంలో నుంచుంటే ఆ కాలం నాటి మనుషుల మధ్య తిరుగుతున్నట్టుగా అనిపించడం ఖాయం. ఇక ఇక్కడికి సమీపంలోనే కృష్ణాలయం వుంది. ఇది రాయలవారు ఎంతో ముచ్చటపడి కట్టించారని శాసనాల ద్వారా తెలుస్తోంది.

చూపరులను సమ్మోహితులను చేసేదిగా ఇక్కడి కృష్ణుడి విగ్రహం ఉండేదట. అయితే కొన్ని అనూహ్యమైన సంఘటనల కారణంగా ఆ విగ్రహాన్ని మరొక ప్రదేశానికి తరలించినట్టు తెలుస్తోంది. అలనాటి ఆ కృష్ణుడికి నీడ నిచ్చినందుకు సంతోషాన్ని ... ఆయన దూరమైనందుకు దుఃఖాన్ని పొందుతున్నట్టుగా ఇక్కడి ఆలయం కనిపిస్తుంది. ఆనాటి చారిత్రక వైభవాన్ని ఈనాటికీ ఆవిష్కరిస్తోన్న ఈ నిర్మాణాలను చూస్తే కళాదృష్టి గల వాళ్లు ఇక్కడి నుంచి కదలడం కష్టమేననిపిస్తుంది ... మనసున్న రాయలవారికి మరొక్కసారి నమస్కరించాలనిపిస్తుంది.

More Bhakti Articles