సువర్చలా హనుమ క్షేత్రం

 సువర్చలా హనుమ క్షేత్రం
బుద్ధినీ ... బలాన్నీ ... విజయాన్ని అనుగ్రహించే దైవంగా అంతా హనుమంతుడిని ఆరాధిస్తూ వుంటారు. సాధారణంగా ప్రతి రామాలయంలోను స్వామివారు తన భక్తులకు దర్శనమిస్తూ వుంటాడు. అంతే కాకుండా తనని నమ్మిన భక్తులను ఆదుకోవడం కోసం, వీరాంజనేయుడుగా ... భక్తాంజనేయుడుగా ... అభయాంజనేయుడుగా ... ప్రసన్నాంజనేయుడుగా వివిధ పేర్లతో అనేక ప్రాంతాల్లో స్వామి ఆవిర్భవించాడు.

ఈ నేపథ్యంలో సువర్చలా సమేతంగా స్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు చాలా తక్కువగా కనిపిస్తూ వుంటాయి. అలాంటి అరుదైన క్షేత్రం కృష్ణా జిల్లా 'ఉయ్యూరు'లో దర్శనమిస్తుంది. ఇక్కడ హనుమంతుడు తన అర్థాంగి అయిన సువర్చలాదేవితో పాటు కొలువుదీరి కనిపిస్తుంటాడు. అయితే హనుమంతుడికి సువర్చలాదేవితో వివాహమైందనీ కొందరు ... కాలేదని కొందరు అనుకుంటూ వుంటారు.

నిజానికి సూర్యుడి పుత్రిక అయిన సువర్చలాదేవితో హనుమంతుడి వివాహం జరిగినట్టుగా శాస్త్రాలు చెబుతున్నాయి. వివాహం అనంతరం కూడా హనుమంతుడు తన నియమానికి భంగం రాకుండా బ్రహ్మచర్యాన్ని పాటించినట్టు స్పష్టం చేస్తున్నాయి. ఉయ్యూరులో గల సువర్చల సమేత హనుమంతుడి ఆలయం విశిష్టమైనదిగా చెబుతుంటారు. ఇక్కడి స్వామిని సిందూరంతోను ... తమలపాకులతోను పూజిస్తుంటారు.

ఈ విధంగా పూజించడం వలన అనతికాలంలోనే అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని అంటారు. హనుమజ్జయంతిన మాత్రమే కాకుండా విశేషమైన పున్యతిథుల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారిని దర్శిస్తూ ... హర్షిస్తూ ... పూజిస్తూ పునీతులవుతుంటారు.

More Bhakti Articles