మొక్కు చెల్లించకుంటే ?

మొక్కు చెల్లించకుంటే ?
జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఆపదలు ... అవాంతరాలు ఎదురవుతూ వుంటాయి. పరిస్థితి తోటివారి సాయం దాటి పోయినప్పుడు అంతా ఆ దేవుడిపైనే భారం వేస్తుంటారు. ఆ గండం నుంచి గట్టెక్కితే దైవానికి అది చేయిస్తామనీ ... ఇది చేయిస్తామని మొక్కుకుంటూ వుంటారు. ముఖ్యంగా నగదును ... ఆభరణాలను హుండీలో వేస్తామని కుటుంబ సభ్యులు అనుకుంటూ వుంటారు. తమ వారు ప్రాణాలతో బయటపడాలనే ఆందోళనలో ... లేదంటే ఏదైనా ఒక క్లిష్టమైన సమస్యను అధిగమించాలనే కంగారులోనో ఎవరికి తోచిన మొక్కులు వాళ్లు మొక్కేస్తుంటారు.

తమ కుటుంబ సభ్యుడు కష్టం నుంచి గట్టెక్కాక, వాళ్లకి అనుక్షణం మొక్కులు గుర్తుకు వస్తూనే వుంటాయి. అయితే గండం గడిచిపోయింది కాబట్టి, మొక్కుబడులు తీరిగ్గా చెల్లించుకోవచ్చని అనుకుంటారు. ఇక తామే స్వయంగా వస్తామని అనుకున్న క్షేత్రానికి వెళ్లకుండా, అక్కడికి వెళుతోన్న బంధుమిత్రులతో ఆ మొక్కుబడులను పంపించేస్తుంటారు. తమకి వెళ్లడం కుదరడం లేదు కనుక, వారితో పంపించామని మనసుకి సర్దిచెప్పుకుంటూ వుంటారు.

ఇలా కానుకలు హుండీలో వేయమని బంధుమిత్రులకు ఇచ్చినప్పుడు, ఒక్కోసారి వాళ్లు మరిచిపోతుంటారు. మరికొందరు ఆ డబ్బును తమ సొంత ఖర్చులకు వాడేస్తుంటారు. ఇంకొందరమో వాటిలో ఖర్చులుపోను మిగిలినవి మాత్రమే హుండీలో సమర్పిస్తుంటారు. ఇంత జరుగుతున్నా భగవంతుడు ఎవరినీ పల్లెత్తు మాట అనడు ... పరిగెత్తుకు వచ్చేసి శిక్షించడు. అయితే కొందరి భక్తుల అనుభవాలను పరిశీలిస్తే మాత్రం, మొక్కుబడుల విషయంలో మాట తప్పిన కారణంగా ఆ తరువాత వాళ్లు తగిన ఫలితాన్ని అనుభవించినట్టు తెలుస్తుంది.

ఇక మొక్కుబడులు చెల్లించమని ఇస్తే, ఆ సొమ్మును వాడుకుని ఆ దోష ఫలితాన్ని పొందిన వాళ్లు కూడా లేకపోలేదు. భగవంతుడు మనం మొక్కుల రూపంలో చెల్లించే సొమ్ముకు ఆశపడడు. ఆ మొక్కు చెల్లించలేదంటే తనపై విశ్వాసం లేనట్టుగా భావించి బాధపడతాడు. ఈ దోషమే మరిన్ని కష్టనష్టాలకు కారణమవుతూ వుంటుంది. అందువలన ఏదైతే దైవానికి మొక్కుకుంటామో అది ఎలాంటి మార్పులు లేకుండా అనుకున్న సమయానికి భగవంతుడికి చెల్లించాలి.

మొక్కుబడిగా చెల్లించమంటూ ఒకరిచ్చిన సొమ్మును సొంత ఖర్చులకు ఉపయోగించడంగానీ, ఆ సొమ్ముని హుండీలో సమర్పించకపోవడం గాని చేయకూడదు. మొక్కు చెల్లించడమంటే భగవంతుడి పట్ల భక్తిశ్రద్ధలను కనబరచడం ... ఆయన పట్ల అపారమైన విశ్వాసాన్ని ప్రకటించడమనే విషయాన్ని మరిచిపోకూడదు.

More Bhakti Articles