కన్యాదాన ఫలితం

కన్యాదాన ఫలితం
భారతీయుల ఆచారవ్యవహారాలకు వివాహ వ్యవస్థ అద్దంపడుతూ వుంటుంది. స్త్రీ - పురుషుల జీవితంలో వివాహం అత్యంత ప్రధానమైనదిగా ... పవిత్రమైనదిగా చెప్పబడుతోంది. వివాహమనే వేడుకలో కనిపించే అనేక అంశాలలో కన్యాదానమనేది ఓ ముఖ్యమైన ఘట్టంగా కనిపిస్తూ వుంటుంది. వధువు తల్లిదండ్రులు ... వరుడుని నారాయణమూర్తి స్వరూపంగా భావిస్తూ, లక్ష్మీదేవి లాంటి తమ కూతురిని అప్పగిస్తారు.

ఈ విధంగా కన్యను దానం చేయడం వలన తమ పూర్వీకులు తరిస్తారని వధువు తల్లిదండ్రులు భావిస్తుంటారు. అలాగే తమకి అనంతమైన పుణ్యఫలాలు కలగడమే కాకుండా, ఉత్తమగతులు లభిస్తాయని విశ్వసిస్తారు. కన్యాదాన సమయంలో చదివే మంత్రం కూడా ఇదే విషయం చెబుతుంది. కూతురిని అత్తవారింటికి పంపించినా, ఆమె సంతోషాన్నే తల్లిదండ్రులు తమ సంతోషంగా భావిస్తుంటారు. ఆమె క్షేమ సమాచారమే వాళ్లని బతికిస్తుంటుంది.

కూతురు తమ కుటుంబ పరువు ప్రతిష్ఠలు నిలిపేలా వ్యవహరించాలనీ, అత్తింటి కీర్తి ప్రతిష్ఠలకు మచ్చరాకుండా ప్రవర్తించాలనే వాళ్లు కోరుకుంటారు. పండుగలకి ... పర్వదినాలకు భర్తతో కలిసి పుట్టింటికి రావాలే గానీ, భర్తతో గొడవపడి పుట్టింటికి రాకూడదని అనుకుంటారు. అలాగే ఆర్ధికపరమైన ఇబ్బందులు కూడా ఆమెకి ఎదురుకాకూడదనుకుంటారు.

అయితే కొన్నిరకాల దోషాల వలన కొంతమంది తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి ... మానసికంగా వారిని కుంగదీస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే 'స్వాతి' నక్షత్రంలో కన్యాదానం చేయాలని శాస్త్రం చెబుతోంది. ఈ నక్షత్రంలో కన్యాదానం చేయడం వలన స్త్రీకి భర్త ప్రేమానురాగాలు పరిపూర్ణంగా లభిస్తాయి.

అత్తవారింట్లో ఆమె ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడుపుతుంది. ఆర్ధికంగా గానీ ... ఆరోగ్యపరంగా గాని ఎలాంటి సమస్యలు ఆమె దరిచేరవు. పుట్టింటివారికి తాను అండగా నిలుస్తుందేగానీ, ఎలాంటి పరిస్థితుల్లోను పుట్టింటి వారిని ఆశ్రయించదు. అందుకే స్వాతి నక్షత్రంలో చేయబడిన కన్యాదానం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని చెప్పబడుతోంది.

More Bhakti Articles