చేసిన పుణ్యం చెబితే పోతుందా?

చేసిన పుణ్యం చెబితే పోతుందా?
'' చేసినపాపం చెబితే పోతుంది'' అనే మాటను మనం తరచూ వింటూ వుంటాం. అయితే చేసిన పాపం చెప్పడం వలన పోతుందో లేదో తెలియదు గానీ, చేసిన పుణ్యం గురించి చెబితే మాత్రం ఆ పుణ్యం కాస్తా పోతుందని శాస్త్రం చెబుతోంది. సాధారణంగా కొంతమంది ఇతరులకు ప్రయోజనాన్ని కలిగించే పనులు చేస్తుంటారు. ఇక వీళ్లు దైవకార్యాలు జరిపించడంలోను ముందుంటారు. బాధ్యతను తమపై వేసుకుని ఆ పనులను సమర్ధవంతంగా నిర్వహిస్తుంటారు.

ఈ నేపథ్యంలో వీళ్లు పదిమందికీ విద్యను అందించే బళ్లు ... ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లే గుళ్లు కట్టిస్తారు. ఇలా ప్రతి మంచిపనిలోను పాలుపంచుకునే కొందరిలో ఓ బలహీనత ప్రధానంగా కనిపిస్తూ వుంటుంది. అంతా తామే చేశామనీ ... తమ వల్లనే అంతా సవ్యంగా జరిగిందని వీళ్లు చెబుతుంటారు. చేసినది చెప్పుకోవడంలో తప్పులేదు కదా అని వీళ్లు అనుకుంటూ వుంటారు. కానీ అలా చెప్పుకోవడం వలన ... వచ్చిన పుణ్యం కాస్తా పోతుందని శాస్త్రం చెబుతోంది.

అందువల్లనే ఇతరులకు చేసిన దాన ధర్మాలను గురించీ, దైవ కార్యాలకు అందించిన సహకారం గురించి ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించకూడదని అంటోంది. నేను ... నాది అనేవి అహంభావానికి అద్దం పడుతుంటాయి. అందువల్ల భగవంతుడు కల్పించినది పదిమందితో కలిసి పంచుకుంటున్నామనే భావన కలగాలి. దైవం ఇచ్చినదానికి కృతజ్ఞతా పూర్వకంగా అందులో కొంత భాగాన్ని ఆయన సేవకి వినియోగిస్తున్నామనే ఆలోచన మెదలాలి. అప్పుడే చేసిన పుణ్యకార్యాలు మనసులోనే నిలిచిపోతాయి ... మరిచిపోలేని విధంగా మంచి ఫలితాలనూ ఇస్తాయి.

More Bhakti Articles