పూజా సామగ్రి శుభ్రత

 పూజా సామగ్రి శుభ్రత
ఒకప్పుడు ఇళ్లలో పూజా మందిరాలు మాత్రమే కనిపిస్తూ ఉండేవి. ఇటీవల కాలంలో కొత్తగా ఇల్లు నిర్మించుకునే వాళ్లు పూజకోసం ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసుకుంటున్నారు. పూజకి ఓ గదంటూ వుంటే, శుచిగా ... శుభ్రంగా వున్నప్పుడు మాత్రమే లోపలికి అడుగుపెట్టవచ్చు ... ఎలాంటి అంతరాయం లేకుండా ఏకాగ్రతతో పూజ చేసుకోవచ్చుననేది నేటి కాలంలో ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తూ వుంటుంది. ఈ కారణంగా ప్రతి ఒక్కరూ పూజ గదికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు.

ఇక పూజగది అంటూ ఉన్నాక పూజకి సంబంధించిన సామాగ్రి అంతా ఆ గదిలోనే వుంటుంది. ఇక పూజకు రాగి లేదా వెండి వస్తువులు వాడటం మంచిదని శాస్త్రం చెబుతోండటం వలన, ఆయా వస్తువులను అంతా పూజ గదిలోనే వుంచుతుంటారు. అయితే ఈ పాత్రలను శుభ్రం చేయడానికి గాను ఎప్పుడు బయటికి తీయాలనే విషయంలో కొంతమంది సతమతమై పోతుంటారు.

సాధారణంగా సాయం సమయంలో పూజ గదిలో వెలిగించిన హారతి పళ్లెం ... నైవేద్యాలు సమర్పించబడిన పాత్ర ... దీపారాధన కొండెక్కిన ప్రమిదలు మొదలైనవి పూజ గదిలోనే వుండిపోతుంటాయి. మరునాడు ఉదయం పనుల ఒత్తిడి ఎక్కువగా వుంటుంది కాబట్టి, ఆ రాత్రే వాటిని బయటికి తీసి శుభ్రం చేయవచ్చా? ... లేదా? అనే సందిగ్ధం అందరినీ వెంటాడుతూ వుంటుంది.

అయితే సాయంకాలం పూజ పూర్తిచేశాక, దీపారాధన కొండెక్కిన తరువాత ఆ వస్తువుల పై నీళ్లు చిలకరించి తీసుకోవచ్చునని శాస్త్రం చెబుతోంది. ఇలా పూజగది నుంచి తీసిన సామాగ్రిని శుభ్రం చేసి మరుసటి ఉదయం పూజకి సిద్ధం చేసుకోవచ్చునని అంటోంది. ఈ విధంగా చేయడం వలన ఎలాంటి దోషం అంటదని స్పష్టం చేస్తోంది.

More Bhakti Articles