కష్టాలను కరిగించే రాఘవేంద్రస్వామి దర్శనం

కష్టాలను కరిగించే రాఘవేంద్రస్వామి దర్శనం
అశేష ప్రజానీకాన్ని భక్తిమార్గంలో నడిపించిన సద్గురువులలో శ్రీ రాఘవేంద్రస్వామి ఒకరు. అడుగడుగునా ... అణువణువునా ఆయన భక్తిభావ పరిమళాలు వెదజల్లిన తీరు అపూర్వం ... అనిర్వచనీయం. భక్తులంతా ఆయనని భగవంతుడి స్వరూపంగా భావిస్తున్నా, ఆయన ఎక్కడా ఎప్పుడూ ఎలాంటి ఆర్భాటాలు చేయలేదు. ప్రశాంతత వున్న చోటునే పరమాత్ముడు నివాసముంటాడని అన్నట్టుగా ఆయన ఎప్పుడూ అలాగే కనిపించేవారు.

దేవుడన్నవారితో ఆయన ఎలా వ్యవహరించారో, కాదన్నవారితోను అదే విధంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో మామూలు వ్యక్తుల నుంచి మహారాజుల వరకూ ఆయనని పరీక్షించడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ భంగపడ్డారు. అంతటి మహిమాన్వితుడైన రాఘవేంద్రస్వామికి అనేక ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించబడ్డాయి. అలాంటి రాఘవేంద్రస్వామి ఆలయం హైదరాబాద్ - వనస్థలిపురంలో దర్శనమిస్తుంది.

సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం, అడుగుపెట్టిందే తడవుగా భక్తులకు ప్రశాంతతను ప్రసాదిస్తుంది. విశాలమైన ఆలయం మధ్య భాగంలో గల ప్రత్యేక మందిరంలో స్వామి బృందావన రూపంలో దర్శనమిస్తూ వుంటాడు. స్వామి వేదికపై గల మందిరంలో కొలువై వుండటం వలన ప్రదక్షిణలు చేసుకోవడానికి ఎంతో వీలుగా వుంటుంది. గురువారం రోజున స్వామివారి దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది.

ఇక రాఘవేంద్ర స్వామి జన్మించిన రోజునీ ... ఆయన సన్యాసాశ్రమం స్వీకరించిన రోజుని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తుంటారు. ఈ రోజుల్లో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. రాఘవేంద్రస్వామిని దర్శించడం వలన, అంకిత భావంతో ఆయనని ఆరాధించడం వలన కష్టాలు కర్పూరంలా ఆవిరైపోతాయనీ, ఆనందాలు అక్కున చేరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles