ఏపీ పరిషత్ పోరుకు పోటెత్తిన నామినేషన్లు.. నువ్వా నేనా అంటున్న టీడీపీ, వైసీపీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ పరిషత్ పోరుకు పోటెత్తిన నామినేషన్లు.. నువ్వా నేనా అంటున్న టీడీపీ, వైసీపీ

AP Parishat Elections Witness Surge in Nominations as TDP and YSRCP Compete
  • జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు భారీగా దాఖలైన నామినేషన్లు
  • ఎంపీటీసీలకు 51,902, జెడ్పీటీసీలకు 5,724 నామినేషన్లు
  • నామినేషన్ల దాఖలులో టీడీపీ, వైసీపీ మధ్య తీవ్ర పోటీ
  • ప్రభుత్వంపై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న కూటమి
  • జగన్‌ది 'హిట్ అండ్ రన్' రాజకీయమంటూ విమర్శలు
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. పరిషత్ పోరులో పోటీ చేసేందుకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి భారీ ఎత్తున స్పందన లభించింది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఉన్న 659 జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 5,724 నామినేషన్లు, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఏకంగా 51,902 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల చివరి రోజున అత్యధికంగా జెడ్పీటీసీలకు 3,315, ఎంపీటీసీలకు 25,016 నామినేషన్లు రావడం ఎన్నికల వేడిని సూచిస్తోంది.

నామినేషన్ల దాఖలులో అధికార, ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ తరఫున అత్యధికంగా 22,013 నామినేషన్లు దాఖలు కాగా, వైసీపీ నుంచి 20,556 మంది నామినేషన్లు వేశారు. ఇక జనసేన పార్టీ తరపున 4,609 మంది, బీజేపీ నుంచి 1,150 మంది తమ అభ్యర్థిత్వాలను నమోదు చేసుకున్నారు.

అదేవిధంగా, జెడ్పీటీసీ స్థానాలకు కూడా ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. టీడీపీ తరఫున 2,078 నామినేషన్లు దాఖలు కాగా, వైఎస్ఆర్సీపీ నుంచి 1,815 మంది బరిలో నిలిచారు. కూటమిలోని జనసేన పార్టీ నుంచి 679 మంది, బీజేపీ తరఫున 255 మంది నామినేషన్లు వేశారు.

జగన్‌పై కూటమి విమర్శలు
ఇంత భారీ సంఖ్యలో ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్లు దాఖలైనప్పటికీ, కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. జగన్ తీరును 'హిట్ అండ్ రన్' థియరీగా వారు అభివర్ణిస్తున్నారు. 

కేవలం ప్రెస్ మీట్లు పెట్టడానికే బెంగళూరు నుంచి అమరావతికి వస్తున్నారని, నిరాధార ఆరోపణలు చేసి తిరిగి వెళ్లిపోతున్నారని కూటమి పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలను గమనించకుండా జగన్ వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. మొత్తం మీద నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పరిషత్ ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కింది.
Advertisement
AP Parishat Elections
TDP vs YSRCP
Jagan Mohan Reddy
ZPTC MPTC Nominations
Andhra Pradesh Politics
Janasena Party

More Telugu News