Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ రాజీనామా అంటూ ఫేక్ న్యూస్‌: సైబర్ చర్యల హెచ్చరికతో క్షమాపణ చెప్పిన వాట్సాప్ గ్రూప్ అడ్మిన్

Pawan Kalyan fake resignation news WhatsApp group admin apologizes after cyber action warning
Advertisement
  • పవన్ కల్యాణ్ రాజీనామా అంటూ వాట్సాప్‌లో తప్పుడు ప్రచారం
  • చర్యల భయంతో బహిరంగ క్షమాపణ చెప్పిన వాట్సాప్ గ్రూప్ అడ్మిన్
  • సోషల్ మీడియాలో చూసి, నిర్ధారించుకోకుండా షేర్ చేశానని వెల్లడి
Advertisement
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పదవికి రాజీనామా చేస్తున్నారంటూ వాట్సాప్‌లో తప్పుడు సమాచారాన్ని సర్క్యులేట్ చేసిన ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ క్షమాపణలు చెప్పారు. ఈ ఫేక్ న్యూస్‌ను తీవ్రంగా పరిగణించిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించడంతో, సదరు అడ్మిన్ వెనక్కి తగ్గారు.

సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ చూసి, నిజానిజాలు నిర్ధారించుకోకుండా "పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా" అని గ్రూప్‌లో షేర్ చేసినట్లు అడ్మిన్ తన వివరణలో తెలిపారు. ఇది ఎలాంటి దురుద్దేశంతో జరగలేదని, పొరపాటున జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్‌కు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, గ్రూప్ సభ్యులకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో పూర్తి వివరాలు తెలుసుకున్నాకే పోస్టులు షేర్ చేస్తానని హామీ ఇచ్చారు.

అంతకుముందు, పవన్ రాజీనామా చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం కార్యాలయం తీవ్రంగా స్పందించింది. "డిప్యూటీ సీఎంఓ, ఆంధ్రప్రదేశ్" పేరుతో నడుస్తున్న ఫేక్ వాట్సాప్ ఛానెల్‌పై, ఇతర తప్పుడు ప్రచారాలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయం పేరును దుర్వినియోగం చేస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ అధికారిక హెచ్చరికల నేపథ్యంలోనే వాట్సాప్ అడ్మిన్ క్షమాపణ చెప్పినట్లు స్పష్టమవుతోంది.
Advertisement
Advertisement
Pawan Kalyan
AP Deputy CM
Fake News Resignation
WhatsApp Group Admin Apology
Andhra Pradesh Cyber Crime
Janasena Party

More Telugu News