Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడలో అంబరాన్నంటిన ఉత్సవ శోభ.. మెగా కార్నివాల్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu launches Mega Carnival as Vijayawada Utsav celebrations reach peak
Advertisement
  • విజయవాడ ఉత్సవ్-2.0లో భాగంగా మెగా కార్నివాల్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • ఏలూరు రోడ్‌లో అట్టహాసంగా సాగిన సాంస్కృతిక కళారూపాల కవాతు
  • మన సంస్కృతే మన ఉనికికి పునాది అని ఉద్ఘాటించిన ముఖ్యమంత్రి
  • 2024కు ముందు రాష్ట్రంలో ఉత్సవాలు లేవని, అశాంతి ఉండేదని వ్యాఖ్య
  • విజయవాడ ప్రజల సహకారానికి 'శభాష్' అంటూ చంద్రబాబు అభినందన
Advertisement
విజయవాడలో సాంస్కృతిక సంబరాలు అంబరాన్నంటాయి. విజయవాడ ఉత్సవ్-2.0 ముగింపు రోజున ఏలూరు రోడ్‌లో నిర్వహించిన మెగా కార్నివాల్ కనుల పండువగా సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్నివాల్ ను లాంఛనంగా ప్రారంభించి, కళా బృందాల కవాతుకు అభివాదం చేశారు. శంఖారావంతో మొదలైన ఈ కార్నివాల్‌తో ఏలూరు రోడ్ జనసంద్రంగా మారింది.

విజయవాడ ఉత్సవ రథంతో కార్నివాల్ కవాతు అట్టహాసంగా మొదలైంది. కాకరపర్రు, కడియం నుంచి తెప్పించిన వివిధ రకాల పూలతో అమ్మవారి చిత్రాన్ని అందంగా తీర్చిదిద్ది, ఉత్సవ రథాన్ని అలంకరించారు. గుర్రాలు, ఒంటెలతో పాటు డప్పు, సన్నాయి వాయిద్య బృందాలు, గరడి సాములు, బేతాళం సెట్ వంటి విభిన్న కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానిక ప్రజలు, యువత ఈ అపురూప దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధిస్తూ కేరింతలు కొట్టారు. మన సంస్కృతి, సంప్రదాయం, కళా వైభవాన్ని ఈ కార్నివాల్ చాటి చెప్పింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, విజయవాడ ఉత్సవ్ ద్వారా పర్యాటకాన్ని, స్థానిక కళాకారులను ప్రోత్సహించడం సంతోషంగా ఉందన్నారు. "ఒకవైపు విజయవాడ ఉత్సవ్, మరోవైపు జాతీయ స్థాయిలో సరస్ మేళాతో నగరానికి ప్రత్యేక కళ వచ్చింది. సోషల్ మీడియాలో గడిపే బదులు ఇలాంటి ఉత్సవాల్లో పాల్గొంటే మానసికోల్లాసం కలుగుతుంది. మన సంస్కృతే మన ఉనికికి పునాది" అని ఆయన పేర్కొన్నారు.

గతంతో పోలిస్తే పాలనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. "రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ఉత్సవాలే లేవు. 2024కు ముందు ఎక్కడ చూసినా అశాంతే ఉండేది. ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నాం. కరవును జయించే శక్తి ఇవ్వాలని దుర్గమ్మను కోరాను" అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. విజయవాడ ఉత్సవ్‌ను విజయవంతం చేసిన నగర ప్రజలకు అభినందనలు తెలుపుతూ "శభాష్ విజయవాడ" అని ప్రశంసించారు.
Advertisement
Advertisement
Chandrababu Naidu
Vijayawada Utsav
Mega Carnival
Andhra Pradesh Tourism
Cultural Festival
Vijayawada News

More Telugu News