22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా వేయండి: ఈసీకి వైసీపీ వినతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా వేయండి: ఈసీకి వైసీపీ వినతి

YSRCP urges SEC to postpone elections in 22 municipalities
  • 22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా వేయాలని ఈసీని కోరిన వైసీపీ
  • టీడీపీ దాడులతో నామినేషన్లు వేయలేకపోయామని ఆరోపణ
  • హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషనర్‌కు వీడియో ఆధారాలు అందజేత
  • 488 వార్డుల్లో అభ్యర్థులు లేకుండా పోయారని ఫిర్యాదులో వెల్లడి
  • కుప్పం ఛైర్మన్ అభ్యర్థి కిడ్నాప్ అయ్యారని, పలువురిపై దాడులు జరిగాయని ఆందోళన
రాష్ట్రంలోని 22 పట్టణ స్థానిక సంస్థల్లో కొత్తగా నామినేషన్లు స్వీకరించాలని లేదా ఎన్నికలను వాయిదా వేయాలని వైసీపీ నేడు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్‌ఈసీ) కోరింది. అధికార టీడీపీ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ వైసీపీ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాను కలిసి ఫిర్యాదు చేసింది.

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, నారాయణమూర్తి తదితరులు కమిషనర్‌ను కలిసి దాడులకు సంబంధించిన వీడియో ఆధారాలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను, మూడు వినతిపత్రాలను సమర్పించారు. అనంతరం అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఓటమి భయంతోనే టీడీపీ కార్యకర్తలు తమ నామినేషన్ పత్రాలను చించివేశారని, కొన్నిచోట్ల పోలీసులు వారికి సహకరించగా, మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులే స్వయంగా పత్రాలను లాక్కున్నారని ఆరోపించారు.

ఈ 22 పురపాలక సంఘాల్లో మొత్తం 809 వార్డులు/డివిజన్లు ఉండగా, కేవలం 321 చోట్ల మాత్రమే తమ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగలిగారని వైసీపీ వివరించింది. మిగిలిన 488 చోట్ల తమ పార్టీ తరఫున అభ్యర్థులే లేకుండా చేశారని, 8 మున్సిపల్ ఛైర్మన్ పదవులకు కూడా నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని తెలిపింది. మైదుకూరులో 19 నామినేషన్ పత్రాలను చించివేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం అక్కడ ఎన్నికలను వాయిదా వేసిందని, అదే తరహా చర్యలు ఈ 22 ప్రాంతాల్లోనూ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, అవినాశ్ రెడ్డిపై జరిగిన దాడులను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆత్మకూరు, కనిగిరిలో స్క్రూటినీ కేంద్రాల్లోనే నామినేషన్ పత్రాలను చించివేశారని తెలిపారు. ప్రొద్దుటూరు, కుప్పంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, కుప్పంలో ఛైర్మన్ అభ్యర్థి విజయ్ కుమార్ అపహరణకు గురయ్యారని, ఆయన ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అపహరణకు గురైన అభ్యర్థులను వెంటనే కాపాడి, వారి కుటుంబాలకు రక్షణ కల్పించాలని కోరారు.

సీసీటీవీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని, హింసకు పాల్పడిన టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని, వారికి సహకరించిన అధికారులను ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి మేయర్ అభ్యర్థి వాసు యాదవ్ బీసీ సర్టిఫికెట్ల అంశాన్ని నిబంధనల ప్రకారం, ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా పరిశీలించాలని కోరారు. ఏకగ్రీవాలను ప్రకటించే ముందు బాధితులైన తమ అభ్యర్థులకు మరోసారి అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు.
Advertisement
YSR Congress Party
Andhra Pradesh Municipal Elections
State Election Commission
Lella Appireddy
TDP

More Telugu News