Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గానికి వార్నింగ్... కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు.. వేడెక్కిన తాడిపత్రి

Kethireddy Peddareddy booked for provocative comments against JC Prabhakar Reddy followers
Advertisement
  • తాడిపత్రిలో హీట్ పెంచిన స్థానిక సంస్థల ఎన్నికలు
  • తనతో పెట్టుకుంటే ప్రతీకారం తీర్చుకుంటానని పెద్దారెడ్డి వార్నింగ్
  • టీడీపీ నేత హాజీ బాషా ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు
Advertisement
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రెచ్చగొట్టేలా, బెదిరింపులకు పాల్పడేలా ఆయన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ తాడిపత్రి పట్టణ అధ్యక్షుడు హాజీ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పెద్దారెడ్డి తన ప్రత్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ తరఫున మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఫయాజ్ బాషాను బరిలోకి దింపుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రత్యర్థి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులు తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా బెదిరిస్తున్నారని కేతిరెడ్డి ఆరోపించారు. తనను తాడిపత్రి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, కోర్టు అనుమతితో రావాల్సి వచ్చిందని గుర్తుచేశారు. "నేను వచ్చినప్పటి నుంచి నా చిటికెన వేలు వెంట్రుక కూడా పీకలేకపోయారు. అధికారం శాశ్వతం కాదు, ఈ విషయం ప్రభాకర్ రెడ్డి అనుచరులు, ఆయనకు మద్దతిచ్చే అధికారులు గుర్తుంచుకోవాలి. నాతో పెట్టుకుంటే ప్రతీకారం తీర్చుకుంటా" అని ఆయన గట్టిగా హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలనే ఆధారంగా తీసుకుని, టీడీపీ నేత హాజీ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దారెడ్డి వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. హాజీ బాషా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పెద్దారెడ్డిపై బీఎన్‌ఎస్ 192, 351(2), 223 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల వేళ ఈ ఘటన తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది. 
Advertisement
Advertisement
Kethireddy Peddareddy
JC Prabhakar Reddy
Tadipatri Politics
Anantapur Police Case
YSRCP vs TDP
Andhra Pradesh Local Body Elections

More Telugu News