Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెన్నైకి తాగునీరు ఇవ్వండి: చంద్రబాబును కోరిన సీఎం విజయ్

CM Vijay requests Chandrababu Naidu to provide drinking water for Chennai
Advertisement
  • ఉండవల్లిలో ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రుల సమావేశం
  • చెన్నై తాగునీటి అవసరాల కోసం అదనపు జలాలు కోరిన సీఎం విజయ్
  • గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చించిన చంద్రబాబు
  • నీటి లభ్యతను బట్టి సాయం చేస్తామని చంద్రబాబు హామీ
  • ఇప్పటికే చెన్నైకి 4.08 టీఎంసీలు విడుదల చేశామని వెల్లడి
Advertisement
తమ రాష్ట్ర రాజధాని చెన్నై నగరం ఎదుర్కొంటున్న తీవ్ర తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తెలుగు గంగ ద్వారా అదనపు జలాలను విడుదల చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయన, మంగళవారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల అంశంపైనే చర్చలు జరిగాయి.

ముఖ్యమంత్రి విజయ్‌కు, ఆయన వెంట వచ్చిన అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో చెన్నై నగర తాగునీటి అవసరాలను తీర్చడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింతగా సహకరించాలని సీఎం విజయ్ అభ్యర్థించారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో కృష్ణా నదిలో జలాల లభ్యత గణనీయంగా తగ్గి, ఏపీలోనే తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయినప్పటికీ, పొరుగు రాష్ట్ర దాహార్తిని తీర్చాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికే ఒప్పందం ప్రకారం చెన్నై నగరానికి 4.08 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు చంద్రబాబు వివరించారు. భవిష్యత్తులో ప్రాజెక్టులలో నీటి లభ్యత, అవసరాలను బేరీజు వేసుకుని, మరికొంత నీటిని విడుదల చేసే అంశాన్ని కచ్చితంగా పరిశీలిస్తామని ఆయన విజయ్‌కు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా కరవు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు ఆవశ్యకతను చంద్రబాబు నొక్కి చెప్పారు. ఈ బృహత్తర పథకం రెండు రాష్ట్రాలకే కాకుండా దేశానికే మేలు చేస్తుందని ఆయన వివరించారు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు ద్వైపాక్షిక అంశాలపై ఫలప్రదమైన చర్చలు జరిగాయి.
Advertisement
Advertisement
CM Vijay
Chandrababu Naidu
Telugu Ganga Project
Chennai Water Crisis
Andhra Pradesh Tamil Nadu Water Sharing

More Telugu News