Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే టీమిండియాకు అదే కీల‌కం: కైఫ్‌

Mohammad Kaif says bowling not Rohit or Kohli is key for 2027 World Cup
Advertisement
  • 2027 ప్రపంచకప్‌పై విశ్లేషణ చేసిన మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్
  • దక్షిణాఫ్రికాలో పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయని అంచనా
  • మెరుగైన బౌలింగ్ ఉన్న జట్టే ప్రపంచకప్ గెలుస్తుందని వ్యాఖ్య
  • ఒక్క ఆటగాడితో ప్రపంచకప్ గెలవడం సాధ్యం కాదని స్పష్టీక‌ర‌ణ‌
  • భారత్ గెలవాలంటే బౌలింగ్, ఫీల్డింగ్ మెరుగుపరుచుకోవాలని సూచన
Advertisement
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల ఆతిథ్యంలో 2027లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌పై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. గతంతో పోలిస్తే దక్షిణాఫ్రికాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, అక్కడ పిచ్‌లు ఇప్పుడు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నాయని విశ్లేషించాడు. 

ఈ నేపథ్యంలో బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉన్నందున, ఏ జట్టుకైతే పటిష్ఠ‌మైన బౌలింగ్ దళం ఉంటుందో అదే విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పాడు. 'హిందుస్థాన్ స్పోర్ట్స్‌'తో మాట్లాడుతూ కైఫ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

"దక్షిణాఫ్రికాలో ఇప్పుడు పరిస్థితులు చాలా మెరుగయ్యాయి. అక్కడ బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తారని నేను అనుకోవడం లేదు. బ్యాటర్లే రాణిస్తారు. అందుకే, ఏ జట్టులో అత్యుత్తమ బౌలర్లు ఉంటారో, వారే విజయం సాధిస్తారు" అని కైఫ్ వివరించాడు. 

2027 నాటికి విరాట్ కోహ్లీకి 39, రోహిత్ శర్మకు 40 ఏళ్లు రానున్న నేపథ్యంలో వారి భాగస్వామ్యంపై నెలకొన్న అనిశ్చితిపై కైఫ్ స్పందించాడు. "అందరి దృష్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపైనే ఉంది. వారిద్దరూ బాగానే ఆడతారని నేను భావిస్తున్నా. కానీ, భారత్ ప్రపంచకప్ గెలవాలంటే బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలను కచ్చితంగా సరిదిద్దుకోవాలి. ఈ రెండు అంశాలే అత్యంత కీలకం" అని అన్నాడు.

విదేశాల్లో ఒక్క ఆటగాడు మాత్రమే ప్రపంచకప్‌ను గెలిపించలేడని, జట్టుగా రాణించడం ముఖ్యమని కైఫ్ నొక్కిచెప్పాడు. "కోహ్లీ ప్రధాన ఆటగాడే అయినా, మిగిలిన వారు కూడా రాణిస్తేనే జట్టుకు సహాయం అందుతుంది" అని పేర్కొన్నాడు. దీనికి ఉదాహరణగా 2003 ప్రపంచకప్‌ను గుర్తుచేశాడు. 

ఆ టోర్నీలో సచిన్ టెండూల్కర్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచినప్పటికీ, జట్టు ఫైనల్‌కు చేరడంలో అందరి పాత్ర ఉందని తెలిపాడు. "సచిన్ మా ప్రధాన బ్యాటర్, కానీ యువరాజ్ సింగ్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కీలక పరుగులు చేశారు. నేను న్యూజిలాండ్‌పై అజేయ అర్ధశతకం సాధించాను. బౌలింగ్‌లో ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, జవగళ్ శ్రీనాథ్ అద్భుతంగా రాణించారు. గంగూలీ కెప్టెన్సీ కూడా అమోఘం" అని కైఫ్ గుర్తుచేసుకున్నాడు.

మెగా టోర్నీలోని రెండు సెమీ-ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకు కేప్ టౌన్, సెంచూరియన్, జోహన్నెస్‌బర్గ్ నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వచ్చే ఏడాది అక్టోబర్ 2న ఈ మెగా టోర్నీ ప్రారంభమై, నవంబర్ 21న ఫైనల్‌తో ముగియనుంది.  
Advertisement
Advertisement
Mohammad Kaif
2027 ODI World Cup
Team India
Virat Kohli
Rohit Sharma
South Africa Pitches

More Telugu News