Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'NO' అని రిప్లై ఇచ్చినందుకే ఒకరి బ్యాంక్ ఖాతా నిలువునా ఖాళీ అయిపోయింది!: సజ్జనార్

VC Sajjanar warns bank account emptied just by replying NO to WhatsApp message
Advertisement
  • వాట్సాప్‌లో 'NO' అని రిప్లై ఇస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ
  • ఇది సైబర్ నేరగాళ్ల సరికొత్త ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్
  • ఓటీపీ, లింకులు లేకుండానే జరుగుతున్న మోసం
  • గుర్తుతెలియని నంబర్లను బ్లాక్ చేయాలని సూచించిన సజ్జనార్
  • మోసపోతే 1930కి కాల్ చేయాలని విజ్ఞప్తి
Advertisement
ఓటీపీ చెప్పాల్సిన పనిలేదు, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయక్కర్లేదు.. కేవలం 'NO' అని రెండక్షరాల సమాధానం ఇస్తే చాలు.. మీ బ్యాంక్ ఖాతాలోని సొమ్ము క్షణాల్లో మాయం! సాంకేతికతను వాడుకుని సైబర్ నేరగాళ్లు పన్నిన ఈ సరికొత్త పన్నాగం ఇప్పుడు పెను సవాలుగా మారింది. 'ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్'గా పిలుస్తున్న ఈ ప్రమాదకరమైన మోసంపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఈ మోసం ఎలా పనిచేస్తుందో, దాని నుంచి ఎలా రక్షించుకోవాలో ఆయన సమగ్రంగా వివరించారు.

మోసం ఎలా జరుగుతుందంటే..

సైబర్ కేటుగాళ్లు పక్కా ప్రణాళికతో ఈ మోసానికి పాల్పడుతున్నారు. ముందుగా, గుర్తుతెలియని వాట్సాప్ నంబర్ నుంచి మీ ఫోన్‌కు ఒక సందేశం వస్తుంది. ‘మీ బ్యాంక్ ఖాతా నుంచి ఇంత మొత్తం డెబిట్ అయ్యింది’ అని ఆ మెసేజ్‌లో ఉంటుంది. అది చూసిన వెంటనే ఎవరైనా కంగారుపడటం సహజం. ఆ కంగారును ఆసరాగా చేసుకుని, వెంటనే మరో సందేశం పంపుతారు. ‘ఈ లావాదేవీ మీరు చేయకపోతే, వెంటనే NO అని రిప్లై ఇవ్వండి’ అని అందులో సూచిస్తారు. ఖాతాలో డబ్బులు పోయాయన్న ఆందోళనతో చాలామంది ఆలోచించకుండా 'NO' అని టైప్ చేసి పంపేస్తారు.

అక్కడే అసలు మోసం దాగి ఉంది. మీరు 'NO' అని సమాధానం పంపిన మరుక్షణమే, ఆ సందేశంలో కంటికి కనిపించకుండా దాగి ఉన్న మాల్‌వేర్ స్క్రిప్ట్స్ లేదా ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ ఫైల్స్ హ్యాకర్లకు మీ మొబైల్ ఫోన్‌పై పూర్తి నియంత్రణను (రిమోట్ యాక్సెస్) అందిస్తాయి. దీంతో వారు మీ ఫోన్‌లోని బ్యాంకింగ్ యాప్‌లు, పాస్‌వర్డ్‌లు, ఇతర సున్నితమైన సమాచారాన్ని సులభంగా దొంగిలించి, క్షణాల్లో మీ బ్యాంక్ ఖాతాను పూర్తిగా ఖాళీ చేస్తారు. ఇటీవల ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సైతం ఈ మోసం బారిన పడి భారీగా నష్టపోయిన ఘటన ఈ దాడి తీవ్రతకు అద్దం పడుతోంది.

ప్రజలకు సజ్జనార్ కీలక సూచనలు

ఈ ప్రమాదకరమైన మోసం నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి వీసీ సజ్జనార్ పలు కీలక సూచనలు చేశారు.

గుర్తుతెలియని నంబర్ల నుంచి బ్యాంక్ లావాదేవీల పేరుతో వచ్చే సందేశాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ 'YES' లేదా 'NO' అని రిప్లై ఇవ్వకూడదు.
అలాంటి సందేశాలు రాగానే కంగారు పడకుండా, వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి, చాట్‌ను పూర్తిగా డిలీట్ చేయాలి. నిజంగా మీ ఖాతా నుంచి డబ్బు కట్ అయిందో లేదో తెలుసుకోవడానికి మీ బ్యాంక్ అధికారిక మొబైల్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెక్ చేసుకోవాలి. వాట్సాప్ సందేశాలను అస్సలు నమ్మవద్దు.

ఏ అధికారిక బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ కూడా వాట్సాప్ ద్వారా ఇలాంటి లావాదేవీల ధ్రువీకరణ కోరదని గుర్తుంచుకోవాలి.

మోసపోతే ఏం చేయాలి?

ఒకవేళ పొరపాటున ఎవరైనా ఈ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘గోల్డెన్ అవర్’లో స్పందించాలని సజ్జనార్ సూచించారు. వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ '1930'కి కాల్ చేయాలి. లేదా cybercrime.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే, దొంగిలించబడిన డబ్బును ఫ్రీజ్ చేసి తిరిగి రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన వివరించారు. కంగారులో ఇచ్చే ఒక్క సమాధానం జీవితకాల సంపాదనను హరించివేయగలదని, కాబట్టి ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement
VC Sajjanar
Cybercrime Alert
WhatsApp Scam
Auto Execution File Attack
Bank Account Fraud
Hyderabad Police Warning

More Telugu News