Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికన్ కుటుంబాలపై అప్పుల భారం.. 15 ఏళ్ల గరిష్ఠానికి రుణ ఎగవేతలు!

American families face heavy debt burden as defaults hit a 15-year high
Advertisement
  • అమెరికాలో 15 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరిన రుణ ఎగవేతలు
  • ప్రతి ఐదు కుటుంబాల్లో ఒకటి చెల్లింపుల్లో వెనుకబాటు
  • ఆదాయం పెరిగినా వడ్డీ రేట్లతో పెరిగిన ఆర్థిక భారం
  • యువత సంపద తగ్గి, అప్పుల్లో కూరుకుపోతున్న వైనం
  • పెరుగుతున్న ‘బై నౌ పే లేటర్’ వినియోగం
Advertisement
అమెరికన్ కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఆదాయం, సంపద పెరుగుతున్నప్పటికీ, అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం కారణంగా అప్పుల భారం తీవ్రమవుతోంది. 2025 చివరి నాటికి, ప్రతి ఐదు అమెరికన్ కుటుంబాల్లో ఒకటి (దాదాపు 20%) రుణ చెల్లింపుల్లో వెనుకబడినట్లు తేలింది. 2007-08 ఆర్థిక మాంద్యం తర్వాత 2010లో నమోదైన స్థాయికి మించి, రుణ ఎగవేతలు ఇంతటి గరిష్ఠ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.

ఫెడరల్ రిజర్వ్ తాజాగా విడుదల చేసిన 2025 సర్వే ఆఫ్ కన్జ్యూమర్ ఫైనాన్సెస్ (ఎస్‌సీఎఫ్) నివేదిక ఈ చేదు వాస్తవాలను వెల్లడించింది. 2022లో రుణ చెల్లింపుల్లో వెనుకబడిన కుటుంబాల వాటా సుమారు 12 శాతంగా ఉండగా, మూడేళ్లలో ఇది 20 శాతానికి చేరింది. రెండు నెలలకు పైగా చెల్లింపులు చేయని వారి సంఖ్య 5 శాతం నుంచి 8 శాతానికి పైగా పెరిగింది. తమ ఆదాయంలో 40 శాతానికి పైగా రుణాలకే చెల్లించే కుటుంబాల వాటా 6.5 శాతం నుంచి 8.6 శాతానికి పెరిగింది. ఇది 2013 తర్వాత ఇదే అత్యధికం.

ఆదాయం పెరిగినా.. తీరని భారం
ఆశ్చర్యకరంగా, ఇదే సమయంలో అమెరికన్ల సగటు ఆదాయం ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన తర్వాత కూడా 7 శాతం పెరిగి 82,200 డాలర్లకు, సగటు నికర సంపద 2 శాతం పెరిగి 2,15,900 డాలర్లకు చేరుకుంది. అయితే, పెరిగిన వడ్డీ రేట్లు, అధిక ధరల పెరుగుదల వారి ఆనందాన్ని ఆవిరి చేశాయి. రుణాల చెల్లింపులు భారంగా మారడంతో ఆర్థిక ఒత్తిడి పెరిగింది. సుమారు 77 శాతం కుటుంబాలు ఏదో ఒక రూపంలో అప్పులు కలిగి ఉన్నాయి.

ఈ ఆర్థిక అసమానతలు అన్ని వర్గాలపై ఒకేలా ప్రభావం చూపడం లేదు. అధిక ఆదాయ వర్గాల వారి సగటు నికర సంపద 31 శాతం పెరిగితే, 35 ఏళ్లలోపు వయసున్న యువ కుటుంబాల సగటు సంపద ఏకంగా 23 శాతం తగ్గి 33,000 డాలర్లకు పడిపోయింది. మరోవైపు, 75 ఏళ్లు పైబడిన వారి సంపద 37 శాతం పెరిగింది. దీంతో యువత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నట్లు స్పష్టమవుతోంది.

పెరుగుతున్న ‘బై నౌ పే లేటర్’ వినియోగం
ఈ ఆర్థిక ఒత్తిడి నేపథ్యంలో అమెరికన్లు 'బై నౌ పే లేటర్' (బీఎన్‌పీఎల్) వంటి కొత్త తరహా రుణాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీని వినియోగం 7 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. బీఎన్‌పీఎల్ రుణం ఉన్న కుటుంబాల్లో సగటు బ్యాలెన్స్ 400 డాలర్లుగా ఉంది. క్రెడిట్ కార్డుల వినియోగం, వాటిపై ఉన్న బ్యాలెన్సులు కూడా పెరిగాయి. మొత్తంమీద, స్థూల ఆర్థిక గణాంకాలు సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ముఖ్యంగా యువత, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్న నమ్మకం కూడా ప్రజల్లో తగ్గుతున్నట్లు ఇతర సర్వేలు సూచిస్తున్నాయి.
Advertisement
Advertisement
American Families
US Debt Delinquency
Federal Reserve SCF Survey
Household Debt Crisis
Consumer Finance Trends
Buy Now Pay Later Usage

More Telugu News