Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భాగ్యనగరంలో డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు.. మెట్రో స్టేషన్ నుంచే గమ్యస్థానానికి!

Hyderabad Driverless Pod Taxis to Connect Metro Stations with Destinations
Advertisement
  • హైదరాబాద్‌లో 40.82 కి.మీ. మేర పాడ్ ట్యాక్సీ నెట్‌వర్క్ ప్రతిపాదన
  • ఐటీ కారిడార్, సచివాలయం పరిసరాల్లో ఏర్పాటుకు ప్రణాళిక
  • సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యాసాధ్యాల నివేదికను వివరించిన అధికారులు
  • పీపీపీ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం యోచన
  • మెట్రో స్టేషన్ల నుంచి లాస్ట్ మైల్ కనెక్టివిటీ కల్పించడమే లక్ష్యం
Advertisement
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు, లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కొత్త రవాణా వ్యవస్థపై దృష్టి సారించింది. మెట్రో స్టేషన్‌లో దిగగానే నేరుగా గమ్యస్థానానికి చేర్చే పాడ్ ట్యాక్సీ (పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ - పీఆర్‌టీఎస్‌) ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఐటీ కారిడార్, సచివాలయం పరిసర ప్రాంతాల్లో మొత్తం 40.82 కిలోమీటర్ల మేర ఈ నెట్‌వర్క్‌ను నిర్మించాలని ప్రతిపాదిస్తూ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక నివేదిక సమర్పించారు.

శుక్రవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో, లీ అసోసియేట్స్ సంస్థ రూపొందించిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదికను అధికారులు సీఎంకు వివరించారు. ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెట్‌వర్క్‌ను ప్రధానంగా నాలుగు కారిడార్లలో ప్రతిపాదించారు. అవి.. కూకట్‌పల్లి-రాయదుర్గం (7.62 కి.మీ.), రాయదుర్గం-నాలెడ్జ్ సిటీ (12.83 కి.మీ.), రాయదుర్గం/హైటెక్ సిటీ-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (14.01 కి.మీ.), సచివాలయం-ఎన్టీఆర్ మార్గ్ (6.36 కి.మీ.).

ఈ ప్రాజెక్టు పూర్తయితే 2030 నాటికి రోజుకు 5.42 లక్షల మంది, 2050 నాటికి 20.31 లక్షల మంది ప్రయాణిస్తారని నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో దేశంలోనే తొలి పాడ్ ట్యాక్సీ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది.

ఈ ప్రతిపాదనపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పీఆర్‌టీఎస్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెట్రో, ఎంఎంటీఎస్, బస్ స్టేషన్లతో దీన్ని అనుసంధానించాలని సూచించారు. ప్రపంచంలోని ఉత్తమ పీఆర్‌టీఎస్ వ్యవస్థలను అధ్యయనం చేసి, పనులను త్వరగా ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. ఈ వ్యవస్థలో డ్రైవర్లు లేకుండా ఎలివేటెడ్ ట్రాక్‌లపై నడిచే చిన్న పాడ్‌లు (3 నుంచి 6 మంది సామర్థ్యం) ఉంటాయి. అయితే, ప్రాజెక్ట్ మొత్తం వ్యయం, టికెట్ ధరలు, నిర్మాణ గడువు వంటి వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
Advertisement
Advertisement
Hyderabad Pod Taxi
Revanth Reddy
Driverless Taxis Hyderabad
HMRL PRTS Project
IT Corridor Connectivity
Hyderabad Metro Rail

More Telugu News