Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మస్క్‌ది వలసవాద మనస్తత్వం: నటుడు కునాల్ కపూర్ ఘాటు వ్యాఖ్యలు

Musk has a colonial mindset Actor Kunal Kapoors sharp comments
Advertisement
  • పశ్చిమ టెక్ బిలియనీర్లలో వలసవాద మనస్తత్వం ఉందన్న కునాల్
  • రక్షకుల్లా ఫీల్ అవుతారంటూ సోషల్ మీడియాలో పోస్ట్
  • భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశంపై వివాదం నేపథ్యంలో వ్యాఖ్యలు
Advertisement
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌పై బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రవేశంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో, పాశ్చాత్య దేశాల టెక్ బిలియనీర్ల వైఖరిని తప్పుబట్టాడు. వారిలో "రక్షకుడిలా భావించే మనస్తత్వం" కనిపిస్తోందని, ఇది ఒక ఆసక్తికరమైన అంశమని తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.

"ఈ వారం ఎలాన్ మస్క్ తీరును గమనిస్తుంటే, పాశ్చాత్య టెక్ బిలియనీర్లలో ఉండే రక్షకుడి భావన స్పష్టంగా కనిపిస్తోంది. వారు మీ దేశానికి వచ్చి భవిష్యత్తును విక్రయిస్తామని చెబుతారు. ఒకవేళ వారిని స్వాగతిస్తే, మీరు ప్రగతిని కోరుకుంటున్నారని కితాబిస్తారు. అదే వేచి ఉండాలని చెబితే, ఒక్కసారిగా మీ ప్రజలు బాధితులుగా మారిపోయారని చిత్రీకరిస్తారు. సొంత వ్యవస్థల నుంచి మిమ్మల్ని తామే రక్షించాలని వారు తహతహలాడుతుంటారు" అని కునాల్ తన పోస్టులో వివరించాడు.

మస్క్ గతంలో చిక్కుకున్న వివాదాలను కూడా కునాల్ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. 2018లో థాయ్‌లాండ్ గుహలో చిక్కుకున్న చిన్నారుల రక్షణ కోసం మస్క్ ప్రతిపాదించిన 'మినీ-సబ్‌మెరైన్'ను స్థానిక నిపుణులు తిరస్కరించినప్పుడు, వారిపై మస్క్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారని ప్రస్తావించాడు. అదేవిధంగా, బ్రెజిల్ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని కోరగా, అక్కడి న్యాయమూర్తిని "నియంత"గా అభివర్ణించిన విషయాన్ని కూడా ఆయన ఉదహరించాడు.

"వలసవాద మనస్తత్వం అంటే ఎల్లప్పుడూ ఒక దేశాన్ని పాలించాలనే కోరిక మాత్రమే కాదు. తాము ఆ దేశానికి రక్షకులుగా వచ్చామని భావించడం కూడా అందులో భాగమే. ఒకవేళ ఆ దేశం ఆ విషయాన్ని వెంటనే గుర్తించకపోతే, ఆ దేశ వ్యవస్థలోనే లోపం ఉందని భావించడమే అసలైన సమస్య" అని కునాల్ తన పోస్ట్‌ను ముగించాడు.

స్పేస్‌ఎక్స్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ 'స్టార్‌లింక్', భారత్‌లో వాణిజ్య కార్యకలాపాల కోసం నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందే ప్రయత్నాల్లో ఉంది. అయితే, దేశంలోని కొందరు వ్యాపారవేత్తలు స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఆరోపిస్తున్న నేపథ్యంలో కునాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Advertisement
Advertisement
Kunal Kapoor
Elon Musk
Starlink India
Colonial Mindset
Tech Billionaires
SpaceX

More Telugu News