Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత సినిమా ఒక నిజమైన లెజెండ్‌ను కోల్పోయింది.. నానా పటేకర్ మృతికి క్రీడా దిగ్గజాల నివాళి

Nana Patekar passes away sports legends pay emotional tribute to the true legend of Indian cinema
Advertisement
  • నానా పటేకర్ మృతి పట్ల కోహ్లీ, సచిన్, యువీ, రైనా సంతాపం
  • భారత సినీ పరిశ్రమ ఓ నిజమైన దిగ్గజాన్ని కోల్పోయిందంటూ నివాళి
  • నటనకే కాక, సామాజిక సేవకు కూడా నానా పటేకర్ చిరపరిచితులు
Advertisement
భారత సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తన విలక్షణ నటనతో హిందీ, మరాఠీ చిత్రసీమలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు నానా పటేకర్ (75) నేడు కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో గుండెపోటుకు గురైన ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలియగానే చిత్ర పరిశ్రమతో పాటు క్రీడా, రాజకీయ రంగాల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నానా పటేకర్ మృతి పట్ల భారత క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీ తీవ్ర సంతాపం తెలిపాడు. "భారత సినిమాకు నిజమైన లెజెండ్. ఆయన నటన, వారసత్వం తరతరాలుగా నిలిచిపోతుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి నానా పటేకర్ జీ. ఓం శాంతి" అని కోహ్లీ తన 'ఎక్స్‌' ఖాతాలో పోస్ట్ చేశాడు.

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా నానా పటేకర్ మరణంపై భావోద్వేగానికి గురయ్యాడు. "నానా పటేకర్ నాకు చాలా సూటిగా, నిరాడంబరంగా ఉండే వ్యక్తిగా గుర్తున్నారు. ఆయన నటనలో కూడా అదే నిజాయతీ కనిపించేది. మరాఠీ అయినా, హిందీ అయినా, తాను పోషించే పాత్రలకు ఆయన ప్రాణం పోశారు. ఆయన మరణవార్త చాలా బాధ కలిగించింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి" అని సచిన్ రాశాడు.

మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా కూడా నానా పటేకర్ కు నివాళులర్పించారు. "ఆయన పవర్‌ఫుల్ నటన, నిజాయతీ, నిరాడంబరత ఆయన్ను భారత సినిమాలోని మరపురాని కళాకారులలో ఒకరిగా నిలిపాయి" అని రైనా పేర్కొన్నాడు.

 "మనం చూసిన గొప్ప నటులలో ఒకరిని సినిమా కోల్పోయింది. ఆయన నటనకు, గొంతుకు నేను మంత్రముగ్ధుడినయ్యాను" అని యువరాజ్ సింగ్ తెలిపాడు.

1978లో 'గమన్' చిత్రంతో నానా పటేకర్ హిందీ చిత్రసీమలో అడుగుపెట్టారు. 1989లో విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన 'పరిందా' చిత్రం ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఇందులో 'అన్నా' అనే క్రూరమైన డాన్ పాత్రలో ఆయన నటనకు జాతీయ ఉత్తమ సహాయ నటుడి అవార్డు లభించింది. 

తన విలక్షణమైన డైలాగ్ డెలివరీ, హావభావాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. కళారంగానికి, సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను 2013లో భారత ప్రభుత్వం ఆయనను నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మశ్రీ'తో సత్కరించింది.

సినిమాలకు అతీతంగా నానా పటేకర్ గొప్ప మానవతావాదిగా కూడా పేరుగాంచారు. ముఖ్యంగా మహారాష్ట్రలో కరవు బారిన పడిన రైతులు, వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఆయన చేసిన సామాజిక సేవ ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆయన మరణం భారత చిత్రసీమకు, సమాజానికి తీరని లోటు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Advertisement
Nana Patekar
Virat Kohli
Sachin Tendulkar
Indian Cinema Legend
Nana Patekar Death
Padma Shri Actor

More Telugu News