Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చందమామపై కరెంటు కోసం అణుశక్తి.. అగ్రదేశాల భారీ ప్లాన్‌!

Moon Nuclear Power for Electricity Superpowers Massive Plan
Advertisement
  • చంద్రుడిపై అణు రియాక్టర్లకు అమెరికా, చైనా, రష్యా సిద్ధం
  • 2030 నాటికి రియాక్టర్‌ ప్రయోగానికి నాసా అడుగులు
  • 20 కిలోవాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే నాసా రియాక్టర్‌ రూపకల్పన
  • 2036కి సిద్ధం చేయనున్న రష్యా ‘సెలీనా’ రియాక్టర్‌
  • రియాక్టర్ల భద్రతపై శాస్త్రవేత్తల ఆందోళనలు
Advertisement
చంద్రుడిపై శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేసేందుకు అగ్రరాజ్యాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా అమెరికా, చైనా, రష్యా ఇప్పుడు చంద్రుడిపై అణు రియాక్టర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాయి. భవిష్యత్తులో చంద్రుడిపై ఎక్కువ కాలం మనుషులు ఉండాలన్నా, అక్కడి వనరులను అన్వేషించాలన్నా విద్యుత్‌ కీలకం. అందుకే ఈ మూడు దేశాలు అణుశక్తిని ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి.

ఓ చిన్న అణు రియాక్టర్‌ తయారీకి కంపెనీల నుంచి ఆగస్టులో నాసా ప్రతిపాదనలు కోరినట్లు ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడించింది. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో పనిచేసేలా దీన్ని రూపొందించనున్నారు. 2030 డిసెంబరు నాటికి ప్రయోగానికి సిద్ధం చేయాలన్నది లక్ష్యం. ఈ రియాక్టర్‌ 20 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ ఐదేళ్ల పాటు మానవ జోక్యం లేకుండా పనిచేసేలా రూపొందించాలని భావిస్తున్నారు.

చైనా కూడా చంద్రుడిపై అణుశక్తిని ఉపయోగించే ప్రణాళికలతో ముందుకెళ్తోంది. చైనాతో కలిసి రష్యా ‘సెలీనా’ పేరుతో రియాక్టర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. 2036 నాటికి దీన్ని సిద్ధం చేయాలని రష్యా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 10 కిలోవాట్ల వరకు విద్యుత్‌ అందిస్తూ పదేళ్ల పాటు సొంతంగా పనిచేసేలా రూపొందించనున్నారు.

ఎందుకంటే.. చంద్రుడిపై రాత్రి ఎక్కువ!
చంద్రుడిపై ఒక రాత్రి రెండు వారాలకు పైగా ఉంటుంది. దీంతో సౌర విద్యుత్‌పై పూర్తిగా ఆధారపడటం కష్టం. ప్రారంభ దశలో అమెరికా, చైనా సౌర విద్యుత్‌, రేడియోఐసోటోప్‌ వ్యవస్థలను ఉపయోగించాలనుకుంటున్నాయి. అయితే పెద్ద స్థావరాలు ఏర్పడితే ఎక్కువ విద్యుత్‌ అవసరమవుతుంది. అక్కడే అణు రియాక్టర్లు కీలకంగా మారనున్నాయి.

భద్రతపైనే అసలు సవాల్‌..
చంద్రుడిపై అణు రియాక్టర్‌ ఏర్పాటు అంత సులభం కాదు. రాకెట్‌ ప్రయోగం విఫలమైతే అణు పదార్థాల విషయంలో ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. చంద్రుడిపై రియాక్టర్‌ను భద్రపరచడం, నిర్వహించడం కూడా కష్టమే. వ్యోమగాములు, పరికరాల భద్రత కోసం రియాక్టర్‌ చుట్టూ కొన్ని ప్రాంతాలను పరిమితం చేయాల్సి రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, రష్యా మాత్రం ప్రయోగ సమయంలో రియాక్టర్లను క్రియాశీలం చేయకుండా తీసుకెళ్లాలని భావిస్తున్నాయి.

చంద్రుడిపై ఎవరిది హక్కు?
ఈ పోటీ మరో కీలక ప్రశ్నను కూడా తెరపైకి తెచ్చింది. 1967లో కుదిరిన ఔటర్‌ స్పేస్‌ ట్రీటీ ప్రకారం ఏ దేశమూ చంద్రుడిని తన భూభాగంగా ప్రకటించుకోకూడదు. అయితే భవిష్యత్తులో స్థావరాల చుట్టూ ఇతర దేశాల ప్రవేశాన్ని పరిమితం చేయవచ్చా? చంద్రుడి నుంచి తీసే వనరులపై హక్కులు ఎవరికి ఉంటాయి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాంకేతిక, భద్రతా సవాళ్ల కారణంగా మూడు దేశాల ప్రస్తుత గడువులు మారే అవకాశం కూడా ఉంది.
Advertisement
Advertisement
Moon Nuclear Reactor
NASA Lunar Mission
Russia China Space Project
Lunar Electricity Generation
Space Nuclear Energy
Moon Exploration 2030

More Telugu News