Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందరికీ తెలియజేయాల్సిన సంతోషకరమైన సమాచారం ఇది: నారా లోకేశ్

Nara Lokesh shares happy news about missing boy Ramayya
Advertisement
  • అదృశ్యమైన గొర్రెల కాపరి బాలుడు రామయ్య కథ సుఖాంతం
  • సోషల్ మీడియాలో వైరల్ పోస్టులతో స్పందించిన మంత్రి లోకేశ్
  • రంగంలోకి దిగి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన నెల్లూరు కలెక్టర్
  • రామయ్య చదువు, తల్లిదండ్రులకు అండగా ఉంటామని లోకేశ్ హామీ
  • కుటుంబానికి ఇల్లు, తండ్రికి వైద్యం, తల్లికి ఉపాధి కల్పిస్తామన్న మంత్రి
Advertisement
సోషల్ మీడియా వేదికగా జరిగిన ఓ మంచి ప్రయత్నం ఫలించింది. నెల్లూరు జిల్లాలో అదృశ్యమైన గొర్రెల కాపరి బాలుడు రామయ్య కథ సుఖాంతమైంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తక్షణమే స్పందించారు. ఆయన ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం, బాలుడిని క్షేమంగా గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. ఈ విషయాన్ని మంత్రి లోకేశ్ స్వయంగా వెల్లడించారు. ఇది అందరికీ అత్యవసరంగా తెలియజేయాల్సిన సంతోషకరమైన సమాచారం అని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

గొర్రెల కాపరిగా ఉన్న రామయ్య అనే బాలుడు కనిపించడం లేదంటూ నిన్నటి నుంచి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఈ విషయం తన దృష్టికి రావడంతో తాను ఎంతో కలత చెందానని మంత్రి లోకేశ్ తెలిపారు. "మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. బాలుడు రామయ్యను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చాం" అని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా నేతృత్వంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, బాలుడి ఆచూకీని వేగంగా కనుగొన్నారని ప్రశంసించారు.

ఈ సందర్భంగా రామయ్య కుటుంబానికి మంత్రి లోకేశ్ పలు హామీలు ఇచ్చారు. బాలుడిని రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించి, చదువు చెప్పిస్తామన్నారు. అనారోగ్యంతో ఉన్న రామయ్య తండ్రికి మెరుగైన వైద్యం, తల్లికి స్వయం ఉపాధి కల్పిస్తామని తెలిపారు. అంతేకాకుండా, ఆ కుటుంబానికి ఇల్లు కూడా మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సమాచారాన్ని తన దృష్టికి తెచ్చిన ప్రతి ఒక్కరికీ, బాలుడిని వెతికి పట్టుకోవడంలో వేగంగా స్పందించిన కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు ఇతర అధికారులకు, సిబ్బందికి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. బాలుడు తన తల్లిదండ్రులతో సంతోషంగా ఉన్న వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.


Advertisement
Advertisement
Nara Lokesh
Ramayya shepherd boy
Nellore missing boy found
Andhra Pradesh government news
Himanshu Shukla Collector
Social media impact AP

More Telugu News