Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్స్ మిషన్‌లో ఆహారం ఎలా? నాసా సమస్యకు పరిష్కారం చూపిన 25 ఏళ్ల యువతి.. రూ.2.85 కోట్ల బహుమతి!

Chinyere Okezie wins NASA Deep Space Food Challenge for Mars mission food system
Advertisement
  • నాసా పోటీలో యువతి ఘన విజయం
  • చిన్యెరె ఉకేజేకు దాదాపు రూ.2.85 కోట్లు
  • 100కిపైగా ఎంట్రీల్లో తొలి బహుమతి
  • 28 రాష్ట్రాలు, 33 దేశాల నుంచి పోటీ
  • 15 మంది సిబ్బందికి ఫుడ్ సిస్టమ్
Advertisement
అంగారకుడిపైకి మనుషులను పంపేందుకు నాసా సన్నాహాలు చేస్తోంది. 2030లలో ఈ మిషన్‌ను చేపట్టే అవకాశం ఉంది. భూమి నుంచి అంగారకుడికి వెళ్లి తిరిగి రావడానికి దాదాపు 34 నుంచి 36 నెలలు పట్టొచ్చని అంచనా. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో వ్యోమగాములకు ఆహారం అందించడం నాసా ముందున్న కీలక సవాళ్లలో ఒకటి.

ఈ సమస్యకు వినూత్న పరిష్కారం చూపిన 25 ఏళ్ల కంప్యూటర్ సైంటిస్ట్, డిజైనర్ చిన్యెరె ఉకేజేకు నాసా నిర్వహించిన పోటీలో 300,000 డాలర్లు (దాదాపు రూ.2.85 కోట్లు) బహుమతి దక్కింది. నార్త్‌ఈస్ట్ ఫిలడెల్ఫియాకు చెందిన ఆమె ఈ పోటీలో మొదటి విజేతగా నిలిచారు.

100కిపైగా ఎంట్రీల మధ్య విజయం
నాసా నిర్వహించిన ‘డీప్ స్పేస్ ఫుడ్ ఛాలెంజ్: మార్స్ టు టేబుల్’లో 28 రాష్ట్రాలు, 33 దేశాల నుంచి 100కిపైగా ఎంట్రీలు వచ్చాయి. వీటిలో చిన్యెరె ఉకేజే రూపొందించిన ‘అడాప్టివ్ న్యూట్రిషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ (ఏఎన్‌ఐ) కాన్సెప్ట్‌కు మొదటి బహుమతి లభించింది.

అంగారకుడిపై లక్షల మైళ్ల దూరంలో ఉన్న వ్యోమగాములు పోషకాహారంతో కూడిన ఆహారాన్ని ఎలా పండించాలి? తయారు చేసుకోవాలి? తినాలి? అన్నదానిపై ఆమె డిజైన్ దృష్టి పెట్టింది.

15 మంది సిబ్బందికి.. 500 మార్టిన్ సోల్స్
అంగారకుడిపైకి మనుషులను పంపడం అంటే ప్రయాణం మాత్రమే కాదు. వారికి అవసరమైన ఆహారం, పోషకాలు అందించడం కూడా పెద్ద సవాలే. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు భూమి నుంచి పంపించే ప్యాక్ చేసిన ఆహారంపైనే ఆధారపడుతున్నారు.

అయితే ప్యాక్ చేసిన ఆహారం కాలం గడిచే కొద్దీ విటమిన్లు, రుచి కోల్పోతుంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని నాసా ప్రజల నుంచి వినూత్న ఆహార వ్యవస్థల డిజైన్లను ఆహ్వానించింది.

మార్స్ మిషన్‌లో 15 మంది సిబ్బందికి 500 మార్టిన్ సోల్స్, అంటే దాదాపు 513 భూమి రోజుల పాటు ఆహారం అందించేలా వ్యవస్థను రూపొందించాలని పోటీదారులను కోరింది. రోజువారీ భోజన ప్రణాళికలు, ఆపరేషనల్ విధానాలు, విజువల్ వాక్‌థ్రూలను కూడా సమర్పించాలని సూచించింది.

ఒక్క యంత్రంపైనే ఆధారపడని డిజైన్
చిన్యెరె ఉకేజే రూపొందించిన ఏఎన్‌ఐ వ్యవస్థలో ప్రధానంగా ఫ్లెక్సిబిలిటీ, సస్టెయినబిలిటీకి ప్రాధాన్యం ఇచ్చారు. ఒక్క యంత్రం పనిచేయకపోతే మొత్తం వ్యవస్థ ఆగిపోయేలా కాకుండా మాడ్యులర్ విధానాన్ని ఆమె రూపొందించారు.

రోజువారీ వంటకు ఉపయోగపడటంతో పాటు విద్యుత్, నీరు, పరికరాలు లేదా సిబ్బంది కొరత ఏర్పడినా వ్యవస్థ పనిచేసేలా దీనిని రూపొందించారు. తాజా ఆహారాన్ని రోజూ వండుకునే అవకాశం కల్పించడంతో పాటు, అనుకోని సమస్యలు వచ్చినప్పుడు కూడా కొనసాగించేలా ఏఎన్‌ఐని డిజైన్ చేశారు.

నాసా ఏమంది?
నాసా మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లోని సెంటెనియల్ ఛాలెంజెస్ ప్రోగ్రామ్ మేనేజర్ జెన్నిఫర్ ఎడ్మన్సన్ ఈ పోటీ ద్వారా అంతరిక్ష ఆహార వ్యవస్థల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త ఆలోచనలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.

పోటీ ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ అలెగ్జాండర్ మేయర్స్ కూడా అంతరిక్షంలో సంపూర్ణ ఆహార వ్యవస్థను రూపొందించడం ఎంత క్లిష్టమైనదో ఈ ఛాలెంజ్ చూపించిందన్నారు.

ఉకేజే రూపొందించిన ఏఎన్‌ఐకి నైజీరియా భూమి, పంటలు, సంతానోత్పత్తికి సంబంధించిన దేవత ‘అని’ పేరు పెట్టారు. భవిష్యత్తులో అంగారకుడిపై మానవ మిషన్లకు ఇలాంటి ఆహార వ్యవస్థలు ఉపయోగపడే అవకాశం ఉందని నాసా పేర్కొంది.
Advertisement
Advertisement
Chinyere Okezie
NASA Mars Mission
Deep Space Food Challenge
Adaptive Nutrition Infrastructure
Space Food Innovation
Mars Astronaut Food

More Telugu News