Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పేరు మార్చినంత మాత్రాన సిద్ధాంతం, నాయకత్వం మారదు: కేటీఆర్

KTR says changing party name does not change ideology and leadership
Advertisement
  • తెలుగు గడ్డపై పుట్టిన పార్టీ జాతీయ స్థాయికి ఎందుకు విస్తరించకూడదన్న కేటీఆర్
  • నా పేరు షారుఖ్ ఖాన్ అని పెట్టుకుంటే షారుఖ్ అవుతానా? అని ప్రశ్న
  • తదుపరి సీఎం కేసీఆర్ అని ధీమా
Advertisement
పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్చినంత మాత్రాన తమ సిద్ధాంతం, ఆలోచనా విధానం, నాయకత్వం మారబోవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. "నా పేరు షారుఖ్ ఖాన్ అని పెట్టుకుంటే నేను షారుఖ్ ఖాన్ అయిపోతానా?" అని ఆయన ప్రశ్నించారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన ఆయన, పార్టీ పేరు మార్పుపై వివరణ ఇచ్చారు.

తెలుగు సినిమాలు పాన్-ఇండియా స్థాయిలో విజయం సాధిస్తున్నప్పుడు, తెలుగు గడ్డపై పుట్టిన రాజకీయ పార్టీ కూడా జాతీయ స్థాయిలో ఎందుకు విస్తరించకూడదని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలనే ఉద్దేశంతోనే పార్టీ పేరు మార్చామని తెలిపారు. రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, కాంగ్రెస్ పాలనపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఆయన జోస్యం చెప్పారు. తదుపరి సీఎం కేసీఆరేనని, తాను కాదని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్‌లపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రజలు పూజించే రాముడు, శివుడి మధ్య తేడాలు సృష్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఉద్యోగాల కల్పన, ఎన్నికల హామీల అమలు వంటి ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడమే ఈ రెండు జాతీయ పార్టీల విధానమని విమర్శించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం విశ్వసనీయతపై తీవ్రమైన సందేహాలు తలెత్తుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఈసీ పనితీరుపై ఇటీవల ఓ జాతీయ మీడియా చేసిన పరిశోధనలో వెల్లడైన అంశాలు నిజమేనని చాలామంది నమ్ముతున్నారని, దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని, అయితే ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ యువతతో కలిసి నడవడంలో విఫలమయ్యారని విమర్శించారు.
Advertisement
Advertisement
KTR
BRS Party
K Chandrashekar Rao
India Today Conclave
Telangana Politics
Election Commission

More Telugu News