Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత్‌లో యాపిల్ పే వచ్చేసింది.. ఎలా ఉపయోగించాలి? ఏయే ఫోన్లలో పనిచేస్తుంది?

Apple Pay has arrived in India How to use it and which phones work
Advertisement
  • భారత్‌లో అధికారికంగా ప్రారంభమైన యాపిల్ పే సేవలు
  • ఐఫోన్, యాపిల్ వాచ్‌లతో కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల సౌకర్యం
  • తొలుత యాక్సిస్ బ్యాంక్ వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డులకు మాత్రమే
  • ప్రస్తుతానికి యూపీఐతో అనుసంధానం లేదని స్పష్టీక‌ర‌ణ‌
  • క్రోమా, జొమాటో, రిలయన్స్ వంటి స్టోర్లలో చెల్లింపులకు అవకాశం
Advertisement
ఐఫోన్ యూజర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యాపిల్ పే సేవలు ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టాయి. అమెరికాలో ప్రారంభమైన పదేళ్లకు పైగా నిరీక్షణ తర్వాత, టెక్ దిగ్గజం యాపిల్ తన కాంటాక్ట్‌లెస్ పేమెంట్ విధానాన్ని మన దేశంలో అధికారికంగా ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఇకపై అర్హత కలిగిన ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ యూజర్లు తమ డివైజ్‌ల ద్వారా సులభంగా, సురక్షితంగా చెల్లింపులు చేయవచ్చు.

ప్రారంభ దశలో, ఈ సేవలు కేవలం యాక్సిస్ బ్యాంక్ జారీ చేసిన వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు, ఇతర కార్డ్ నెట్‌వర్క్‌లను కూడా ఈ జాబితాలో చేర్చనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్' (యూపీఐ)తో యాపిల్ పేకు ప్రస్తుతానికి ఎలాంటి అనుసంధానం లేదని స్పష్టం చేసింది.

యాపిల్ పే ఎలా సెటప్ చేసుకోవాలి?
యాపిల్ పేను ఉపయోగించడం కోసం ముందుగా ఐఫోన్‌లోని ‘వాలెట్’ యాప్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ కుడివైపు పైన ఉండే ప్లస్ (+) గుర్తుపై ట్యాప్ చేసి, స్క్రీన్‌పై కనిపించే సూచనలను పాటిస్తూ తమ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వివరాలను యాడ్ చేసుకోవాలి. యాక్సిస్ బ్యాంక్ మొబైల్ యాప్‌లోని లేటెస్ట్ వెర్షన్ ద్వారా కూడా కార్డును యాపిల్ పేకు జతచేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే యాపిల్ పే సేవలు వినియోగానికి సిద్ధమవుతాయి.

స్టోర్లలో చెల్లింపులు చేయడానికి, ఐఫోన్‌లోని సైడ్ బటన్‌ను (పాత మోడళ్లలో హోమ్ బటన్) రెండుసార్లు క్లిక్ చేయాలి. అనంతరం ఫేస్ ఐడీ, టచ్ ఐడీ లేదా పాస్‌కోడ్‌తో అథెంటికేట్ చేసి, ఫోన్‌ను కాంటాక్ట్‌లెస్ పేమెంట్ రీడర్‌కు దగ్గరగా ఉంచితే చాలు, లావాదేవీ పూర్తవుతుంది. 

యాపిల్ వాచ్‌తో కూడా ఇదే పద్ధతిలో చెల్లించవచ్చు. యాప్స్, వెబ్‌సైట్లలో పదేపదే కార్డు వివరాలు నమోదు చేయకుండా కూడా యాపిల్ పే ద్వారా సురక్షితంగా చెల్లింపులు చేయవచ్చు. కార్డుపై లభించే రివార్డులు, ప్రయోజనాలు యథావిధిగా వర్తిస్తాయి.

ప్రస్తుతానికి ఐఓఎస్ 18 లేదా ఆపై వెర్షన్ ఉన్న ఐఫోన్ XR, ఆ తర్వాతి మోడళ్లు, అలాగే వాచ్‌ఓఎస్ 11 లేదా ఆపై వెర్షన్ ఉన్న యాపిల్ వాచ్ సిరీస్ 6, ఆ తర్వాతి మోడళ్లలో ఈ సేవలు పనిచేస్తాయి. తొలుత యాపిల్ స్టోర్లు, బ్లింకిట్, చాయోస్, క్రోమా, రిలయన్స్ బ్రాండ్లు, టాటా 1ఎంజీ, జొమాటో వంటి చోట్ల యాపిల్ పే చెల్లింపులను స్వీకరిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వేదికలపై ఈ సేవలు విస్తృతం కానున్నాయి.
Advertisement
Advertisement
Apple Pay
Apple Pay India
Axis Bank
iPhone
Contactless payments
Digital Wallet

More Telugu News