Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గురువులపై దాడి.. వైసీపీ దుర్మార్గానికి పరాకాష్ఠ: పల్లా

Palla Srinivasa Rao says attack on teachers is the peak of YSRCP wickedness
Advertisement
  • ఉపాధ్యాయులపై దాడులు దుర్మార్గమన్న పల్లా శ్రీనివాసరావు
  • బాధ్యులను ఉపేక్షించొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి
  • డీఎస్సీపై దుష్ప్రచారంతో అభ్యర్థులను దెబ్బతీసే కుట్ర అని వ్యాఖ్య
  • స్పోర్ట్స్‌ కోటా టీచర్లపై ఆరోపణలు సరికాదన్న పల్లా
  • గురువులను అవమానించే రాజకీయాలు మానుకోవాలని హితవు
Advertisement
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడటం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. విజయవాడలోని శాప్‌ కార్యాలయం వద్ద డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాలపై వైసీపీ చేపట్టిన ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతపై ఆయన స్పందించారు. పాఠాలు చెప్పే గురువులపై చేయిచేసుకోవడం హేయమని, బాధ్యులను ఉపేక్షించకూడదని అన్నారు. ఉపాధ్యాయులను అవమానించే రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

ఉపాధ్యాయులు అంటే గౌరవం లేని వైసీపీ నేతలు ఉద్యోగాలు సాధించిన టీచర్లను అవమానించడంతో పాటు దాడులకు దిగారని పల్లా విమర్శించారు. క్రీడల్లో ప్రతిభ చాటి పతకాలు సాధించి, కష్టపడి చదివి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన వారిపై అనుమానాలు రేకెత్తించడం సరికాదన్నారు. స్పోర్ట్స్‌ కోటా టీచర్లు తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలు, పతకాలు నిజమైనవేనని వెల్లడించినా రాజకీయ రాద్ధాంతం చేయడం దేనికని ప్రశ్నించారు.

ఉపాధ్యాయ వృత్తి సాధారణ ఉద్యోగం కాదని పల్లా అన్నారు. ఒక టీచర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కఠోర శ్రమ, చదువు, పోటీ, కుటుంబం ఆశలు ఉంటాయని చెప్పారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే మార్గదర్శకులుగా గురువులు నిలుస్తారని పేర్కొన్నారు. అలాంటి ఉపాధ్యాయులను రోడ్లపైకి లాగి అవమానించడం, దాడులకు పాల్పడటం సరికాదన్నారు.

డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు రాజకీయ రాద్ధాంతంగా మారాయని పల్లా అన్నారు. జగన్‌రెడ్డికి విద్యారంగంపై, ఉపాధ్యాయులపై గౌరవం లేదని విమర్శించారు. కరోనా సమయంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టిన తీరును ఆయన ప్రస్తావించారు. డీఎస్సీపై ఆరోపణలు ఉంటే ఆధారాలతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి యువతకు ఉద్యోగ భరోసా కల్పించిందని పల్లా తెలిపారు. మంత్రి నారా లోకేశ్‌ చొరవతో విద్యారంగంలో సంస్కరణలు చేపడుతున్నామని చెప్పారు. రాజకీయ జోక్యానికి తావులేకుండా పాఠశాలలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, ఉపాధ్యాయుల సంక్షేమం, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

గురువులపై దాడి చేసిన వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పల్లా కోరారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులను కించపరిచే రాజకీయాలు మానుకోవాలని జగన్‌రెడ్డికి హితవు పలికారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్య, ఉద్యోగ రంగాల్లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు కొనసాగుతాయని తెలిపారు.
Advertisement
Advertisement
Palla Srinivasa Rao
TDP AP President
YSRCP attack on teachers
DSC sports quota appointments
Andhra Pradesh education news
Jagan Mohan Reddy criticism

More Telugu News