Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

2026లో సోషల్‌ మీడియా ఇలా మారిపోతోంది.. మీరు చూస్తున్నదంతా మునుపటిలా ఉండదు!

Social Media will change completely in 2026 what you see will never be the same
Advertisement
  • పర్ఫెక్ట్‌ కంటే సహజమైన కంటెంట్‌కు ఆదరణ
  • చిన్న క్రియేటర్లకూ వైరల్‌ అయ్యే అవకాశం
  • సోషల్‌ మీడియాలోనే సమాచారం వెతుకుతున్న యూజర్లు
  • ఏఐ కంటే హ్యూమన్‌ టచ్‌కు పెరుగుతున్న విలువ
  • షాపింగ్‌ నిర్ణయాలపై సోషల్‌ మీడియా ప్రభావం
Advertisement
సోషల్‌ మీడియా ప్రతి ఏడాది కొత్తగా మారుతోంది. ఒకప్పుడు అందమైన ఫొటోలు, ట్రెండింగ్‌ పాటలు, భారీ ఫాలోయింగ్‌ ఉన్న సెలబ్రిటీలే ఎక్కువగా కనిపించేవారు. ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతోంది. సాధారణంగా తీసిన వీడియోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. లక్షలాది మంది ఫాలోవర్లు లేకపోయినా చిన్న క్రియేటర్లు పెద్ద ఆడియన్స్‌ను సంపాదించుకుంటున్నారు. అంతేకాదు.. సోషల్‌ మీడియా ఇప్పుడు కేవలం టైమ్‌పాస్‌ కోసం చూసే వేదికగా కాకుండా సమాచారం వెతకడానికి, వస్తువులు కొనడానికి, కొత్త ప్రదేశాలు తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతోంది. 2026లో సోషల్‌ మీడియాను మార్చుతున్న ఐదు ముఖ్యమైన ట్రెండ్స్‌ ఇవే.

రియల్‌ లైఫ్‌కు ప్రాధాన్యం
ప్రతి ఫొటోను పర్ఫెక్ట్‌గా చూపించాలనే ఆలోచన క్రమంగా తగ్గుతోంది. కొంచెం బ్లర్‌గా ఉన్న ఫొటో, ఒక్క టేక్‌లో తీసిన వీడియో, సహజంగా మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరీ ఎక్కువగా ప్లాన్‌ చేసిన కంటెంట్‌ కంటే నిజ జీవితానికి దగ్గరగా కనిపించే పోస్టులకు ఆదరణ పెరుగుతోంది. క్రియేటర్లు తమ జీవితంలోని చిన్న చిన్న లోపాలను కూడా చూపిస్తున్నారు. అంటే సోషల్‌ మీడియాలో ‘పర్ఫెక్ట్‌ లైఫ్‌’ కంటే ‘రియల్‌ లైఫ్‌’కు ప్రాధాన్యం పెరుగుతోంది.

లక్షల ఫాలోవర్లు లేకపోయినా..
గతంలో సోషల్‌ మీడియాలో గుర్తింపు రావాలంటే భారీ ఫాలోయింగ్‌ ఉండాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రికమెండేషన్‌ ఆధారిత ఫీడ్స్‌ వల్ల చిన్న క్రియేటర్లు కూడా ఒక్క పోస్టుతో వేలాది మందికి చేరుతున్నారు. ఇప్పటికే ఫేమస్‌ అయిన వ్యక్తుల కంటే కొత్తగా వచ్చినవారికీ వైరల్‌ అయ్యే అవకాశం పెరిగింది. కొన్నిసార్లు రోజుల తరబడి కష్టపడి తయారు చేసిన వీడియో కంటే సరదాగా తీసిన చిన్న క్లిప్‌ ఎక్కువగా వైరల్‌ అవుతోంది.

సోషల్‌ మీడియాలోనే సమాధానాలు!
రెస్టారెంట్‌ ఎలా ఉంది? ఏ హోటల్‌ బాగుంటుంది? ఏ స్కిన్‌కేర్‌ ప్రొడక్ట్‌ కొనాలి? జైపూర్‌లో రెండు రోజుల్లో ఏం చూడాలి? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు చాలామంది సోషల్‌ మీడియాలోనే సమాధానాలు వెతుకుతున్నారు. ముఖ్యంగా వీడియోల ద్వారా నిజమైన అనుభవాలు తెలుసుకోవడం ప్రజలకు ఆసక్తిగా మారింది. ఒక రెస్టారెంట్‌ పేరు తెలుసుకోవడం మాత్రమే కాదు.. అక్కడి వాతావరణం, ఫుడ్‌, ధరలు ఎలా ఉన్నాయో కూడా వీడియోల్లో చూసి నిర్ణయం తీసుకుంటున్నారు. దీంతో సోషల్‌ మీడియా క్రమంగా సెర్చ్‌ ఇంజిన్‌లా మారుతోంది.

ఏఐ కంటెంట్‌ పెరిగే కొద్దీ..
ఏఐతో ఫొటోలు, వీడియోలు, క్యాప్షన్లు, స్క్రిప్టులు క్షణాల్లో తయారవుతున్నాయి. దీంతో కంటెంట్‌ తయారు చేయడం చాలా సులభమైంది. కానీ అందరూ ఒకే రకమైన ఏఐ టూల్స్‌ ఉపయోగిస్తుండటంతో కేవలం అందంగా కనిపించే కంటెంట్‌ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోకపోవచ్చు. వ్యక్తిగత అనుభవం, ప్రత్యేకమైన హాస్యం, సహజమైన మాటతీరు, చిన్న చిన్న పొరపాట్లు కంటెంట్‌కు ప్రత్యేకతను ఇస్తున్నాయి. ఏఐ పోస్టును తయారు చేయగలదు.. కానీ దానిపై ఆసక్తి కలిగించే వ్యక్తిత్వాన్ని మాత్రం ఇవ్వలేదు.

సోషల్‌ మీడియా నుంచి షాపింగ్‌ వరకు..
సోషల్‌ మీడియాలో చూసిన వస్తువును కొనడం ఇప్పుడు చాలా సాధారణంగా మారుతోంది. ఒకరు వేసుకున్న షూస్‌ నచ్చితే అవి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుంటున్నారు. ఒక మేకప్‌ ప్రొడక్ట్‌ లేదా గ్యాడ్జెట్‌ ఎలా పనిచేస్తుందో క్రియేటర్‌ వీడియోలో చూసి కొనుగోలు చేస్తున్నారు. అందుకే క్రియేటర్లు ఇప్పుడు వినోదం అందించడంతో పాటు కొనుగోలు నిర్ణయాలపై కూడా ప్రభావం చూపుతున్నారు. అయితే ప్రతి సిఫార్సు నిజాయతీగా ఉంటుందని భావించకూడదు. వినోదం, ప్రచారం, షాపింగ్‌.. ఈ మూడింటి మధ్య ఉన్న గీతలు మరింత చెరిగిపోతున్నాయి.
Advertisement
Advertisement
Social Media
Social Media Trends 2026
Content Creation
Artificial Intelligence
Social Media Shopping
Digital Marketing

More Telugu News