విశాఖలో 'కొరియన్ కనకరాజు' సక్సెస్ మీట్... హాజరైన మంత్రి కందుల దుర్గేశ్

Kandula Durgesh Attends Korean Kanakaraju Success Meet in Visakhapatnam
  • ఏపీని ఫిల్మ్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్న మంత్రి కందుల దుర్గేశ్
  • పెట్టుబడులతో ముందుకొస్తే భూములు, సహకారం అందిస్తామని భరోసా
  • విశాఖలో ‘కొరియన్ కనకరాజు’ విజయోత్సవ సభలో పాల్గొన్న మంత్రి
  • వరుణ్ తేజ్ నటనను, చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించిన దుర్గేశ్
  • చంద్రబాబు, పవన్ కల్యాణ్ మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్తున్నామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ చలనచిత్ర హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించిన ‘కొరియన్ కనకరాజు’ చిత్ర విజయోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన డబ్బింగ్ థియేటర్లు, రీ-రికార్డింగ్ స్టూడియోలు, షూటింగ్ లొకేషన్ల వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే నిర్మాతలకు, పారిశ్రామికవేత్తలకు భూ కేటాయింపులతో పాటు ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ను సినిమా నిర్మాణానికి ప్రధాన వేదికగా మారుస్తామని మంత్రి వివరించారు. తద్వారా స్థానిక కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆకాంక్షించారు.

అనంతరం ‘కొరియన్ కనకరాజు’ చిత్రంపై స్పందిస్తూ.. కథానాయకుడు వరుణ్ తేజ్ వినోదాత్మక పాత్ర నుంచి గ్యాంగ్‌స్టర్ పాత్ర వరకు వైవిధ్యమైన నటనను ప్రదర్శించారని కొనియాడారు. హాస్య నటుడు సత్య, కథానాయిక రితికా నాయక్ తమ అభినయంతో ఆకట్టుకున్నారని తెలిపారు. రాయలసీమ యాసను, అక్కడి జీవనశైలిని తెరపై సహజంగా ఆవిష్కరించినందుకు చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. బలమైన కథాంశం, పటిష్టమైన స్క్రీన్‌ప్లేతో చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు మేర్లపాక గాంధీతో పాటు నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడిలను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.                             
Advertisement
Kandula Durgesh
Korean Kanakaraju Success Meet
Visakhapatnam Gurajada Kalakshetram
Andhra Pradesh Film Hub
Varun Tej
Merlapaka Gandhi

More Telugu News