Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భాగ్యనగరంలో ట్రంప్ టవర్స్.. కోకాపేటలో భారీ ప్రాజెక్ట్

Trump Towers in Hyderabad with 65 floor twin towers
Advertisement
  • హైదరాబాద్ కోకాపేటలో ట్రంప్ టవర్స్ నిర్మాణం
  • ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రెబెకా, ఇరా రియల్టీ భాగస్వామ్యం
  • ఒక్కో ఫ్లాట్ ధర రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు
  • రికార్డు స్థాయిలో రూ.62 కోట్లకు అమ్ముడైన ఒక్కో పెంట్‌హౌస్
  • దక్షిణ భారతంలో ఇదే తొలి ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్ట్
Advertisement
హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. నగరంలో నిర్మాణంలో ఉన్న ఓ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్‌లో ఒక పెంట్‌హౌస్ ఏకంగా రూ.62 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ 'ట్రంప్ ఆర్గనైజేషన్' నిర్మిస్తోంది. 'ట్రంప్ టవర్స్' పేరుతో భాగ్యనగరంలోకి అడుగుపెడుతున్న ఈ ప్రాజెక్ట్‌తో దక్షిణ భారత మార్కెట్లోకి ఆ సంస్థ తొలిసారి ప్రవేశించింది.

హైదరాబాద్‌కు చెందిన ఇరా రియల్టీ, ట్రంప్ బ్రాండ్‌కు భారత అధికారిక ప్రతినిధి అయిన ట్రెబెకా డెవలపర్స్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మంగళవారం ఈ ప్రాజెక్ట్ వివరాలను ట్రెబెకా వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా, ఇరా రియల్టీ వ్యవస్థాపకుడు నర్సిరెడ్డి వెల్లడించారు. కోకాపేటలోని గోల్డెన్ మైల్ రోడ్‌లో 4 ఎకరాల విస్తీర్ణంలో 65 అంతస్తులతో రెండు ఆకాశహర్మ్యాలను నిర్మించనున్నట్లు వారు తెలిపారు. మొత్తం 22 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో 450 లగ్జరీ అపార్ట్‌మెంట్లు, 16 పెంట్‌హౌస్‌లు ఉంటాయి.

ఈ ప్రాజెక్ట్ కోసం భూమి విలువ మినహా రూ.1,700 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు కల్పేష్ మెహతా వివరించారు. ఈ ఏడాది చివరికల్లా నిర్మాణ పనులు ప్రారంభించి, రాబోయే నాలుగేళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఫ్లాట్ల అమ్మకాల ద్వారా రూ.3,500 కోట్ల నుంచి రూ.4,200 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

ట్రంప్ టవర్స్‌లో 3.5, 4 బీహెచ్‌కే ఫ్లాట్ల ధరలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య ఉంటాయని మెహతా తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పటికే కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని, కొన్ని బుకింగ్స్ కూడా జరిగాయని ఆయన అన్నారు. ఇప్పటివరకు 8 పెంట్‌హౌస్‌లను రూ.250 కోట్లకు విక్రయించినట్లు, అందులో ఒక పెద్ద పెంట్‌హౌస్ రూ.62 కోట్లకు అమ్ముడైనట్లు ఆయన తెలిపారు.

భారత్‌లో ట్రంప్ బ్రాండ్‌కు ఇది ఎనిమిదో ప్రాజెక్ట్. 2014లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఈ సంస్థ ఇప్పటికే ముంబై, పూణె, గురుగ్రామ్, నోయిడా, కోల్‌కతాలలో ప్రాజెక్టులను ప్రారంభించింది. అయితే దక్షిణ భారతదేశంలో ఇదే తొలి ప్రాజెక్ట్ కావడం విశేషం. హైదరాబాద్ రియల్టీ మార్కెట్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ ట్రంప్ టవర్స్ భాగ్యనగరానికి ఒక ఐకానిక్ కట్టడంగా నిలిచిపోతుందని కల్పేష్ మెహతా ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement
Trump Towers
Hyderabad Real Estate
Kokapet Luxury Apartments
Tribeca Developers
Ira Realty
Donald Trump

More Telugu News