దోమను చంపకుండానే మలేరియాకు చెక్‌.. కొత్త దోమతెరతో శాస్త్రవేత్తల ప్రయోగం

Malaria prevention without killing mosquitoes New mosquito net experiment by scientists
  • దోమను చంపకుండానే మలేరియాను అడ్డుకునే దోమతెర
  • దోమలోని పరాన్నజీవినే లక్ష్యంగా చేసుకునే రసాయనాలు
  • మెరుగైన ఫలితాలు ఇచ్చిన ELQ-453, ELQ-613
  • నిరోధకత సంతరించుకున్న దోమలపైనా ప్రభావం కనిపించిన వైనం
  • విస్తృత వినియోగానికి ఇంకా పరీక్షలు అవసరం
ఇప్పటివరకు మలేరియా నియంత్రణలో ప్రధానంగా దోమలను చంపడంపైనే దృష్టి ఉండేది. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆ ఆలోచనకు భిన్నమైన మార్గాన్ని పరీక్షించారు. దోమను చంపకుండా.. దాని శరీరంలోకి వెళ్లిన మలేరియా పరాన్నజీవిని అడ్డుకునే రసాయనాలతో దోమతెరలను తయారు చేసే అవకాశాన్ని పరిశీలించారు.

పాత పద్ధతికి సవాల్‌
మలేరియా నియంత్రణలో ఇన్‌సెక్టిసైడ్‌ ట్రీటెడ్‌ బెడ్‌ నెట్స్‌ కీలక పాత్ర పోషిస్తున్నాయి. దోమతెరను తాకిన దోమలను క్రిమిసంహారకాలు చంపడం లేదా నిర్వీర్యం చేయడం ద్వారా మనుషులకు మలేరియా సోకకుండా అడ్డుకుంటాయి. అయితే కాలక్రమేణా కొన్ని ప్రాంతాల్లో దోమలు ఈ క్రిమిసంహారకాలకు నిరోధకతను పెంచుకుంటున్నాయి. దీంతో పాత పద్ధతి ప్రభావం తగ్గుతోంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా మలేరియా కారణంగా 26.3 కోట్ల కేసులు, 5.97 లక్షల మరణాలు నమోదైనట్లు అధ్యయనం పేర్కొంది.

పరాన్నజీవిని టార్గెట్‌ చేస్తే?
ఇక్కడే కొత్త పరిశోధన ఆసక్తికరంగా మారింది. హార్వర్డ్‌ టీహెచ్‌ చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు అనుబంధ పరిశోధకుల నేతృత్వంలోని 2025 అధ్యయనంలో దోమను చంపడం కాకుండా.. దోమలో పెరిగే ‘ప్లాస్మోడియం ఫాల్సిపేరం’ పరాన్నజీవిని లక్ష్యంగా చేసుకున్నారు.

మలేరియా సోకిన రక్తాన్ని పీల్చిన తర్వాత పరాన్నజీవి కొంతకాలం దోమ శరీరంలోనే అభివృద్ధి చెందుతుంది. చివరకు దోమ లాలాజల గ్రంథులకు చేరిన తర్వాత మరో మనిషిని కుట్టినప్పుడు మలేరియా వ్యాప్తి చెందుతుంది. ఈ మధ్యంతర దశనే పరిశోధకులు లక్ష్యంగా చేసుకున్నారు.

81 సమ్మేళనాల పరీక్ష
పరిశోధకులు మలేరియాపై ఇప్పటికే తెలిసిన 81 సమ్మేళనాలను పరీక్షించారు. ఇవి 28 రకాల విధానాల్లో పరాన్నజీవిపై పనిచేసే రసాయనాలు. వీటిలో 22 సమ్మేళనాలు మలేరియా పరాన్నజీవి అభివృద్ధిని గణనీయంగా అడ్డుకున్నాయి.

వాటిలో ELQ-453, ELQ-613 అనే రెండు సమ్మేళనాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇవి పరాన్నజీవి మైటోకాండ్రియాలోని ఒక ముఖ్యమైన కాంప్లెక్స్‌లోని వేర్వేరు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటాయి.

దోమతెరను కేవలం తాకితే చాలు!
ప్రయోగశాలలో రసాయనాన్ని నేరుగా దోమపై వేయడం ఒక విషయం. కానీ దోమతెరపై రసాయనం ఉండి.. దోమ తన కాళ్లతో కొన్ని క్షణాలు తాకినప్పుడు అది దోమ శరీరంలోకి చేరాలి. ఇదే ఈ పరిశోధనలో కీలకమైన సవాలు.

13 సమ్మేళనాలను దోమ కాళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యంపై పరీక్షించగా.. ELQ-456 మాత్రమే స్పష్టమైన యాంటీ-పారాసిటిక్‌ ప్రభావాన్ని చూపింది. తర్వాత రసాయన నిర్మాణంలో చిన్న మార్పులు చేసి ELQ-453, ELQ-613లను అభివృద్ధి చేశారు. ఈ సమ్మేళనాలను కలిపి ఉపయోగించినప్పుడు మలేరియా పరాన్నజీవి సంక్రమణను మరింత సమర్థంగా అడ్డుకున్నాయి.

దోమ బతికినా.. మలేరియా వ్యాప్తి కాదు!
ఈ విధానంలో ఆసక్తికరమైన అంశం ఇదే. దోమతెరను తాకిన వెంటనే దోమ చనిపోవాల్సిన అవసరం లేదు. అది బతికి తర్వాత మలేరియా సోకిన వ్యక్తిని కుట్టినా.. దాని శరీరంలో పరాన్నజీవి సాధారణంగా అభివృద్ధి చెందకుండా చేయడమే లక్ష్యం.

ఇప్పటికే మలేరియా పరాన్నజీవిని మోస్తున్న దోమలపై కూడా ఈ సమ్మేళనాలు ప్రభావం చూపించాయి. పరాన్నజీవి అభివృద్ధి నెమ్మదించడం, దాని సంఖ్య తగ్గడం, లాలాజల గ్రంథులకు చేరే పరాన్నజీవుల శాతం తగ్గడం వంటి ఫలితాలు కనిపించాయి.

రెండు రసాయనాలు.. నిరోధకతకు డబుల్‌ అడ్డుకట్ట?
మరో ముఖ్యమైన అంశం రెండు సమ్మేళనాలను కలిపి ఉపయోగించడం. ELQ-453 ఒక ప్రాంతాన్ని, ELQ-613 మరో ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటాయి.

ఒక ప్రాంతంలో మార్పు చెందిన పరాన్నజీవులు మరో సమ్మేళనానికి కూడా నిరోధకత చూపుతాయా అని పరిశోధకులు పరిశీలించారు. పరీక్షించిన పరిస్థితుల్లో అలాంటి క్రాస్‌-రెసిస్టెన్స్‌ కనిపించలేదు.

అంటే భవిష్యత్తులో ఈ రెండు రకాల సమ్మేళనాలను కలిపి ఉపయోగించడం ద్వారా పరాన్నజీవిలో నిరోధకత అభివృద్ధి చెందడాన్ని మరింత కష్టతరం చేసే అవకాశం ఉంది.

దోమతెరల్లో కలిపినా పనిచేశాయి
పరిశోధకులు ఈ సమ్మేళనాలను ప్లాస్టిక్‌ ఫిల్మ్‌లలో కలిపి పరీక్షించారు. తయారీ సమయంలో 150 డిగ్రీల సెల్సియస్‌ వరకు వేడి చేసినప్పటికీ వాటి ప్రభావం కొనసాగింది.

అంతేకాదు.. గది ఉష్ణోగ్రత వద్ద వెలుతురుకు గురై ఏడాది పాటు నిల్వ చేసిన తర్వాత కూడా ప్రభావం కనిపించింది. క్రిమిసంహారకాలకు నిరోధకత ఉన్న దోమలపై కూడా ఇవి పనిచేశాయి. పాలిస్టర్‌ దోమతెరలతో చేసిన ప్రయోగాల్లోనూ మలేరియా పరాన్నజీవి సంక్రమణను పూర్తిగా అడ్డుకునే ఫలితాలు కనిపించాయి.

ఇప్పుడే మార్కెట్‌లోకి రావు
ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. ఈ దోమతెరలు వెంటనే మార్కెట్‌లోకి వచ్చేస్తాయని చెప్పలేం. ఇప్పటివరకు జరిగిన పరీక్షలు ప్రధానంగా ప్రయోగశాల పరిస్థితుల్లోనే జరిగాయి.

నిజ జీవిత పరిస్థితుల్లో దోమతెరలు ఎంతకాలం ప్రభావవంతంగా ఉంటాయి? ఉష్ణోగ్రత, తేమ, వాడకం వంటి పరిస్థితుల్లో రసాయనాలు ఎలా పనిచేస్తాయి? మనుషులకు ఎంతవరకు సురక్షితం? వంటి అంశాలపై మరిన్ని పరీక్షలు అవసరం.

మలేరియా నియంత్రణలో కొత్త ఆలోచన
ఇప్పటివరకు దోమతెర అంటే.. దోమను చంపే ఆయుధం. ఈ పరిశోధన మాత్రం దోమతెరను మరో విధంగా ఉపయోగించే అవకాశాన్ని చూపిస్తోంది. దోమను చంపాల్సిన అవసరం లేదు.. అది మలేరియాను వ్యాప్తి చేయలేకపోతే చాలు.
Advertisement
Malaria
Mosquito Nets
Plasmodium falciparum
Harvard TH Chan School
Anti parasitic compounds
Malaria prevention technology

More Telugu News