వాట్సాప్‌లో కొత్త రూల్‌.. ఇక వయసు చెప్పాల్సిందేనా?

WhatsApp New Rule Will You Have To Reveal Your Age
  • భారత్‌లో పుట్టిన తేదీ నమోదు ఫీచర్‌ను పరీక్షిస్తున్న వాట్సాప్‌
  • ప్రస్తుతం కొంత మంది యూజర్లకే ఈ అవకాశం
  • పుట్టిన తేదీ నమోదు ఇప్పటికి ఐచ్ఛికమే
  • వివరాలు ఇవ్వకపోయినా యథావిధిగా వాట్సాప్‌
  • వయసు వివరాలను ఇతరులకు చూపబోమని కంపెనీ స్పష్టీకరణ
  • డీపీడీపీ చట్టానికి అనుగుణంగానే ఈ ప్రయోగం
భారత్‌లో వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. కొందరు వినియోగదారులకు పుట్టిన తేదీ నమోదు చేసే అవకాశం ఇచ్చింది. దేశంలో త్వరలో అమల్లోకి రానున్న డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ (డీపీడీపీ) చట్టానికి అనుగుణంగా ఈ ప్రయోగం చేస్తున్నట్లు తెలిసింది.

ఇటీవల కొందరు యూజర్లకు వాట్సాప్‌లో ‘మీ పుట్టిన తేదీని నమోదు చేయండి’ అంటూ సందేశం కనిపించింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ ఫీచర్‌ను కొంత మంది వినియోగదారులతో పరీక్షిస్తున్నామని వాట్సాప్‌ ధ్రువీకరించింది.

ప్రస్తుతం పుట్టిన తేదీ నమోదు పూర్తిగా ఐచ్ఛికమని కంపెనీ స్పష్టం చేసింది. వివరాలు ఇవ్వకపోయినా యాప్‌ను యథావిధిగా ఉపయోగించవచ్చని తెలిపింది. ఈ ఫీచర్‌ వల్ల వాట్సాప్‌ వినియోగంలో ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించింది.

వయసుకు సంబంధించిన సమాచారం వ్యక్తిగతమని వాట్సాప్‌ పేర్కొంది. ఆ వివరాలను ఇతర వినియోగదారులకు చూపబోమని స్పష్టం చేసింది. గోప్యతకు భంగం కలగకుండా వయసు నిర్ధారించే మార్గాలపై పరీక్షలు చేస్తున్నామని తెలిపింది.

డీపీడీపీ చట్టంలోని నిబంధనల ప్రకారం చిన్నారుల వ్యక్తిగత సమాచారాన్ని నిర్వహించే డిజిటల్‌ వేదికలు వినియోగదారుల వయసును నిర్ధారించే విధానం అమలు చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు ఉన్న వారిని గుర్తించే వ్యవస్థ ఉండాలని చట్టం చెబుతోంది. అదే దిశగా వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల భారత్‌లో మెటా సేవలపై ప్రభుత్వ పర్యవేక్షణ పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్‌బుక్‌ పోస్టు తాత్కాలికంగా తొలగించడంపై మెటా క్షమాపణ చెప్పింది. మరోవైపు మొబైల్‌ నంబర్‌ అవసరం లేకుండా యూజర్‌నేమ్‌తో కనెక్ట్‌ అయ్యే ఫీచర్‌ను విడుదల చేయొద్దని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ వాట్సాప్‌ను కోరింది. నకిలీ ఖాతాలు, డిజిటల్‌ మోసాలపై ఉన్న ఆందోళనలే దీనికి కారణంగా చెబుతున్నారు.
Advertisement
WhatsApp
Date of birth feature
DPDP Act India
Age verification
Meta India
Digital Personal Data Protection

More Telugu News