20 ఏళ్ల క్రితం అవయవ దానం... ప్రాణం పోసిన వ్యక్తి సోదరుడితో ఇప్పుడు వివాహం

Woman marries brother of boy who saved her life twenty years ago
  • ప్రాణం నిలిపిన వ్యక్తి సోదరుడినే పెళ్లాడనున్న యువతి
  • 20 ఏళ్ల క్రితం లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌తో బతికిన బ్రూక్లిన్ డాట్సన్
  • ప్రమాదంలో చనిపోయిన పదేళ్ల మైఖేల్ వాటర్స్ అవయవదానం
  • మైఖేల్ సోదరుడు నోవా వాటర్స్‌తో బ్రూక్లిన్‌కు సెప్టెంబర్ 26న వివాహం
రెండు దశాబ్దాల క్రితం ఓ బాలుడి అవయవదానంతో ప్రాణాపాయం నుంచి బయటపడిన ఓ యువతి, ఇప్పుడు అదే బాలుడి సోదరుడిని వివాహం చేసుకోబోతోంది. ప్రేమ, త్యాగం, విధివిలాసాల కలయికతో కూడిన ఈ అరుదైన ఘటన అమెరికాలోని కెంటకీలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, బ్రూక్లిన్ డాట్సన్ (24) అనే యువతికి 2003లో కేవలం కొన్ని నెలల వయసులోనే అరుదైన కాలేయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. సకాలంలో అవయవ మార్పిడి చేయకపోతే ఆమె ప్రాణాలు దక్కవని వైద్యులు తెలిపారు. సరిగ్గా అదే సమయంలో ఒహాయోలో జరిగిన కారు ప్రమాదంలో మైఖేల్ వాటర్స్ అనే పదేళ్ల బాలుడు మృతి చెందాడు. అవయవదానం చేయాలన్న మైఖేల్ అభీష్టాన్ని గౌరవిస్తూ అతని తల్లిదండ్రులు అందుకు అంగీకరించారు. దీంతో మైఖేల్ కాలేయాన్ని బ్రూక్లిన్‌కు అమర్చడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి.

ఈ అవయవ మార్పిడి ఆ రెండు కుటుంబాల మధ్య విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరిచింది. ఏళ్లు గడుస్తున్నా బ్రూక్లిన్ కుటుంబం, మైఖేల్ కుటుంబంతో నిరంతరం సంప్రదింపులో ఉండేది. ఈ క్రమంలో మైఖేల్ తమ్ముడు నోవా వాటర్స్‌తో బ్రూక్లిన్‌కు ఏర్పడిన పరిచయం క్రమంగా స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరూ సెప్టెంబర్ 26న వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

"మా అన్నయ్య ఎప్పుడూ ఇతరుల శ్రేయస్సు కోరేవాడు. కానీ, తను కాబోయే నా భార్య ప్రాణాలను కాపాడతాడని అప్పట్లో ఎవరూ ఊహించలేదు" అని నోవా భావోద్వేగానికి లోనయ్యాడు. తన ప్రాణదాత అయిన మైఖేల్ జ్ఞాపకార్థం తాను ప్రతి నిత్యం ఎంతో గౌరవంగా జీవిస్తున్నానని బ్రూక్లిన్ పేర్కొంది. ఒక విషాదకర ఘటనతో ప్రారంభమైన వీరి పరిచయం, నేడు ఒక మధురమైన ప్రేమ బంధంగా రూపాంతరం చెందడం అందరినీ ఆకట్టుకుంటోంది.
Advertisement
Brooklyn Dotson
Noah Waters
Organ Donation Love Story
Kentucky Wedding
Michael Waters Organ Donor

More Telugu News