Advertisement

చికెన్‌ Vs గుడ్లు: తక్కువ క్యాలరీలతో ఎక్కువ ప్రోటీన్‌కు ఏది బెస్ట్‌?

Chicken versus Eggs Which is best for high protein with low calories
  • చికెన్‌లో గుడ్ల కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ప్రొటీన్‌
  • క్యాలరీల్లో మాత్రం స్వల్ప తేడా మాత్రమే
  • చికెన్‌లో కొవ్వు తక్కువ, ప్రొటీన్‌ ఎక్కువ
  • గుడ్లలో విటమిన్లు, కోలిన్‌, యాంటీఆక్సిడెంట్లు పుష్కలం
  • లక్ష్యాన్ని బట్టి ఆహారం ఎంపిక చేయాలని నిపుణుల సూచన
  • రెండింటినీ సమతుల ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం
ప్రొటీన్‌ ఎక్కువగా తీసుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేవి చికెన్‌, గుడ్లు. జిమ్‌కు వెళ్లేవాళ్లు, బరువు తగ్గాలనుకునేవాళ్లు, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవాళ్లు ఈ రెండింటినీ ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే రెండూ ప్రొటీన్‌కు మంచి వనరులే అయినప్పటికీ.. తక్కువ క్యాలరీల్లో ఎక్కువ ప్రొటీన్‌ ఏది ఇస్తుంది? చికెన్‌, గుడ్లలో ఏది మంచి ఎంపిక? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

చికెన్‌, గుడ్లు రెండూ శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. కానీ ప్రొటీన్‌, క్యాలరీలు, కొవ్వు పరంగా చూస్తే రెండింటి మధ్య స్పష్టమైన తేడా ఉంది. అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం.. 100 గ్రాముల ఉడికించిన స్కిన్‌లెస్‌ చికెన్‌ బ్రెస్ట్‌లో 31 గ్రాముల ప్రొటీన్‌, 165 క్యాలరీలు, 3.6 గ్రాముల కొవ్వు ఉంటుంది. అదే 100 గ్రాముల ఉడికించిన గుడ్లలో 12.6 గ్రాముల ప్రొటీన్‌, 155 క్యాలరీలు, 10.6 గ్రాముల కొవ్వు ఉంటుంది.

ఇక్కడ గమనించాల్సింది క్యాలరీల్లో పెద్దగా తేడా లేకపోవడం. రెండింటి మధ్య కేవలం 10 క్యాలరీలే తేడా ఉంది. కానీ ప్రొటీన్‌ విషయంలో మాత్రం చికెన్‌ స్పష్టంగా ముందంజలో ఉంది. గుడ్లతో పోలిస్తే రెండున్నర రెట్లు ఎక్కువ ప్రొటీన్‌ను అందిస్తుంది. కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే కండరాల పెరుగుదల, బరువు నియంత్రణ, ఎక్కువ ప్రొటీన్‌ తీసుకోవాలనుకునేవారికి చికెన్‌ బ్రెస్ట్‌ను నిపుణులు సూచిస్తుంటారు.

చికెన్‌లో ప్రొటీన్‌తో పాటు విటమిన్‌ బీ3 (నయాసిన్‌), విటమిన్‌ బీ6, ఫాస్ఫరస్‌, సెలీనియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శారీరక శక్తికి, రోగనిరోధక శక్తి, కండరాల పనితీరుకు ఉపయోగపడతాయి. ప్రొటీన్‌ ఎక్కువగా ఉన్న ఆహారం ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో బరువు తగ్గాలనుకునేవారికీ ఇది ఉపయోగపడుతుంది.

అలా అని గుడ్లను తక్కువ అంచనా వేయొద్దు. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్‌ ఏ, డీ, ఈ, బీ12తో పాటు మెదడు పనితీరుకు అవసరమైన కోలిన్‌ అనే పోషకం ఉంటుంది. అలాగే కంటి ఆరోగ్యానికి ఉపయోగపడే ల్యూటిన్‌, జియాక్సాంథిన్‌ అనే యాంటీఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. అందుకే పచ్చసొనను తీసేయకుండా గుడ్డు మొత్తాన్ని తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ఏది తినాలన్నది మీ లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది. తక్కువ క్యాలరీల్లో ఎక్కువ ప్రొటీన్‌ కావాలంటే చికెన్‌ బ్రెస్ట్‌ మంచి ఎంపిక. పోషకాల సమతుల్యత, మెదడు, కంటి ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్లు కూడా కావాలంటే గుడ్లు తప్పనిసరిగా ఆహారంలో ఉండాలి. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ తింటేనే పూర్తి ప్రయోజనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Advertisement
Chicken
Eggs
Protein
Weight loss
Muscle growth
Nutritional facts

More Telugu News