Advertisement

భోగాపురం ఎయిర్ పోర్టు వద్ద గిరిజన బాలికలు, మహిళల అద్భుతం.. థింసా నృత్యంతో గిన్నిస్ బుక్‌ రికార్డు

Dhimsa dance Guinness World Record by tribal women at Bhogapuram Airport
  • భోగాపురంలో థింసా నృత్యంతో గిన్నిస్ ప్రపంచ రికార్డు
  • సుమారు 13,000 మంది గిరిజన మహిళలు, విద్యార్థినుల ప్రదర్శన
  • మన్యం సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఏపీ ప్రభుత్వం
  • గిరిజన మంత్రి సంధ్యారాణికి గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ అందజేత
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురంలో గిరిజన విద్యార్థినులు, మహిళలు చారిత్రాత్మక ఘనత సాధించారు. సుమారు 13,000 మంది ఏకకాలంలో సంప్రదాయ థింసా నృత్యం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణం ఈ అద్భుత ప్రదర్శనకు వేదికగా నిలిచింది. రేపు ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు 13 వేల మందితో థింసా నృత్వం ప్రదర్శించడం ద్వారా స్వాగతం పలకనున్నారు. అందుకు సన్నాహకంగా ఇవాళ థింసా నృత్య ప్రదర్శన రిహార్సల్ చేపట్టారు.

మన్యం ప్రాంత గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ సంకీర్ణ ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో వివిధ ఐటీడీఏ పాఠశాలలకు చెందిన గిరిజన విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. వారంతా సంప్రదాయబద్ధంగా గులాబీ రంగు, ఆకుపచ్చ అంచు చీరలను ధరించి, ఎంతో లయబద్ధంగా థింసా నృత్యం చేసి ఆకట్టుకున్నారు.

ఈ మహా ప్రదర్శనను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు అక్కడే ఉండి పర్యవేక్షించారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ప్రదర్శన జరిగిందని నిర్ధారించుకున్న తర్వాత, దీనిని అధికారికంగా ప్రపంచ రికార్డుగా ప్రకటించారు. ప్రభుత్వ పక్షాన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్‌ను అందుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి కూడా గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రోజుల తరబడి కఠోర సాధన చేసి ఈ రికార్డును సాధించిన మహిళలు, వారికి శిక్షణ ఇచ్చిన సిబ్బంది, అధికారులను మంత్రి అభినందించారు. గిరిజన కళారూపాలను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లేందుకు చేసిన ఈ ప్రయత్నాన్ని ఆమె ప్రశంసించారు.
Advertisement
Dhimsa Dance
Bhogapuram Airport
Guinness World Record
Gummadi Sandhyarani
Vizianagaram
Narendra Modi

More Telugu News