Advertisement

సూపర్ ఎల్ నినో సమయంలో ప్రతి నీటి బొట్టు విలువైనదే: పవన్ కల్యాణ్

Pawan Kalyan discusses AP water scarcity with Minister Nimmala Rama Naidu
  • పవన్ తో సమావేశమైన నిమ్మల రామానాయుడు
  • రాష్ట్రంలోని సాగునీటి పరిస్థితులపై చర్చించిన నేతలు
  • నీటి ఎద్దడిపై రైతుల్లో అవగాహన కల్పంచాలన్న పవన్

రాష్ట్రంలో సూపర్‌ ఎల్‌నినో ప్రభావం వల్ల నెలకొన్న సాగునీటి కొరతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టు ఎంతో అమూల్యమైనదని, కాలువల్లో పూడిక తీత, గట్ల లీకేజీల నివారణ వంటి తక్షణ చర్యల ద్వారా నీటి వృథాను అరికట్టాలని పిలుపునిచ్చారు.


డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటి పరిస్థితులపై ఇరువురూ విస్తృతంగా చర్చించారు. నీటి ఎద్దడిపై రైతుల్లో అవగాహన కల్పించడంతో పాటు, ప్రత్యామ్నాయ సాగు మార్గాలపై దృష్టి సారించాలని పవన్ సూచించారు. రైతుల ఆందోళనను తగ్గించేందుకు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు.


పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల రైతు ప్రయోజనాల కోసం ఏలేరు ప్రాజెక్టు నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు మంత్రి నిమ్మల రామానాయుడికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు తానే స్వయంగా ఏలేరు ఆయకట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు మంత్రి వివరించారు.


కాగా, ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని మంత్రి నిమ్మల అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరితగతిన పూర్తి కోలుకుని, మళ్లీ ప్రజాసేవలో మునుపటి కంటే మరింత చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.

Advertisement
Pawan Kalyan
Nimmala Rama Naidu
Super El Nino Andhra Pradesh
Yeleru Project water release
AP irrigation water crisis
Water conservation measures

More Telugu News