ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. యువతిపై పోలీసు కేసు నమోదు

PM Modi Case Filed Against Woman For Inappropriate Remarks
  • ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువతిపై కేసు
  • పేపర్ లీక్‌లపై నిరసన సందర్భంగా జంతర్ మంతర్‌లో ఘటన
  • నోయిడాలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు.. కేసును ఢిల్లీకి బదిలీ
  • నిరసనకారులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదన్న సీజేపీ
  • క్రిమినల్ చరిత్ర లేని విద్యార్థులపై చర్యలుండవన్న ఢిల్లీ ప్రభుత్వం
ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి దూషణలకు పాల్పడినందుకు 25 ఏళ్ల యువతిపై పోలీసు కేసు నమోదైంది. పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా 'కాక్రోచ్ జ‌న‌తా పార్టీ' (సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జులై 23న జరిగిన నిరసన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రుచికా సింగ్ అనే యువతి ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఓ వ్యక్తి బుధవారం ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, ప్రజా అశాంతిని ప్రేరేపించే వ్యాఖ్యలు చేయడం, పరువు నష్టం కలిగించడం వంటి ఆరోపణలతో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 352, 353(1), 356(1) కింద కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. అనంతరం తదుపరి విచారణ కోసం ఈ కేసును ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

ఈ ఘటనపై సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందించారు. రుచికా సింగ్ వాడిన భాష తప్పు కావచ్చు కానీ, నిరసనకారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. "ఎవరైనా అభ్యంతరకర భాష వాడితే, బాధితులు పరువు నష్టం దావా వేసుకోవచ్చు. అంతేకానీ, నిరసన తెలిపిన వారిపై క్రిమినల్ చట్టాలను ప్రయోగించడం ఆమోదయోగ్యం కాదు. ఇది భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. అదే సమయంలో యువతరం తమ పదజాలం విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేయవద్దు" అని ఆయన హితవు పలికారు.

మరోవైపు ఈ నిరసనలకు సంబంధించి అరెస్ట్ అయిన వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని ఢిల్లీ ప్రభుత్వం నిన్న‌ ప్రకటించింది. ఢిల్లీ హోంమంత్రి ఆశిష్ సూద్ మాట్లాడుతూ.. "మేము విద్యార్థులకు అండగా ఉంటాం. క్రిమినల్ చరిత్ర ఉన్న సంఘ విద్రోహ శక్తులు మినహా, మిగతా విద్యార్థులపై చర్యలు ఉండవు. విద్యార్థుల నిరసనను అదునుగా చేసుకుని హింసను ప్రేరేపించే వారిని మాత్రం వదిలిపెట్టం" అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉంది.
Advertisement
PM Modi
Ruchika Singh
Jantar Mantar Protest
Derogatory Remarks Case
Cockroach Janata Party
Paper Leak Protest

More Telugu News