అమెరికా ఫెడ్‌ సంస్కరణల్లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌కు కీలక పాత్ర!

Raghuram Rajan plays key role in US Federal Reserve reforms
  • ఫెడ్‌ సంస్కరణ కమిటీలో రఘురామ్‌ రాజన్‌కు చోటు
  • బ్యాలెన్స్‌ షీట్‌ సమీక్షలో రాజన్‌ కీలక పాత్ర
  • ఐదు స్వతంత్ర టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసిన కెవిన్‌ వార్ష్‌
  • భిన్న అభిప్రాయాల నిపుణులను తీసుకురావడాన్ని సెనెట్‌ ప్రశంస
  • తొలి నివేదికలు సెప్టెంబర్‌లో, తుది సిఫార్సులు ఏడాది చివరికి
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ తమ ద్రవ్య విధానంలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఆ దిశగా ఆర్థిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నిపుణులను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. ఆ జాబితాలో మాజీ ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌కు చోటు దక్కడం విశేషం. ఫెడ్‌ భవిష్యత్‌ విధానాలపై ఆయన అభిప్రాయాలు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ కెవిన్‌ వార్ష్‌ ప్రత్యేక సంస్కరణల కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ఫెడ్‌ బ్యాలెన్స్‌ షీట్‌ సమీక్ష కమిటీలో రఘురామ్‌ రాజన్‌ను చేర్చారు. ద్రవ్య విధాన రూపకల్పనలో కొత్త ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు వార్ష్‌ వెల్లడించారు. గత ఐదేళ్లుగా లక్ష్యాన్ని దాటి కొనసాగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఫెడ్‌ విధానాలను సమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు.

అమెరికా కాంగ్రెస్‌లో జరిగిన తొలి అర్ధవార్షిక ద్రవ్య విధాన విచారణ సందర్భంగా సెనెట్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఛైర్మన్‌ టిమ్‌ స్కాట్‌ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. బ్యాలెన్స్‌ షీట్‌పై భిన్న అభిప్రాయాలు కలిగిన నిపుణులను ఒకే కమిటీలో చేర్చడం సరైన నిర్ణయమని అన్నారు. జెరెమీ స్టెయిన్‌తో పాటు రఘురామ్‌ రాజన్‌ను కూడా తీసుకురావడం వల్ల అన్ని కోణాల్లో చర్చ జరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

తాను విశ్వసించే 15 మంది భిన్నాభిప్రాయాల నిపుణులను ఎంపిక చేశానని వార్ష్‌ చెప్పారు. పారదర్శకతతో పాటు కొత్త ఆలోచనలకు ఈ కమిటీలు వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.

టాస్క్‌ఫోర్స్‌లకు ఆరు నెలల గడువు ఇచ్చినట్లు వార్ష్‌ వెల్లడించారు. తొలి నివేదికలు సెప్టెంబర్‌కే వచ్చే అవకాశం ఉందని, తుది సిఫార్సులు ఏడాది చివరికి అందుతాయని చెప్పారు. ఇవి సలహా కమిటీలు మాత్రమేనని, తుది విధాన నిర్ణయాలు ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ తీసుకుంటుందని స్పష్టం చేశారు. 2013 నుంచి 2016 వరకు ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్‌ రాజన్‌ ఆర్థిక స్థిరత్వం, ద్రవ్య విధానంపై అంతర్జాతీయ స్థాయిలో నిపుణుడిగా పేరుగాంచారు.
Advertisement
Raghuram Rajan
US Federal Reserve
RBI Governor
Kevin Warsh
Monetary Policy Reform
US Economy Inflation

More Telugu News