ఇరాన్‌ రాజకీయాల్లో ప్రకంపనలు.. ఇజ్రాయెల్ ప్లాన్ బయటపెట్టిన ‘న్యూయార్క్ టైమ్స్’

Mahmoud Ahmadinejad secret alliance with Israel Mossad exposed
  • ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్‌తో ఇజ్రాయెల్ రహస్య ఒప్పందం
  • ప్రభుత్వాన్ని కూలదోసి, ఆయనను అధ్యక్షుడిగా నిలబెట్టేందుకు కుట్ర
  • ‘న్యూయార్క్ టైమ్స్’ కథనంతో వెలుగులోకి సంచలన విషయాలు
  • కుట్ర విఫలమవడంతో గృహనిర్బంధంలో అహ్మదీనెజాద్!
అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఇజ్రాయెల్‌ను నామరూపాల్లేకుండా చేస్తానంటూ నిరంతరం నిప్పులు చెరిగిన కరడుగట్టిన నేత, మాజీ అధ్యక్షుడు మహ్మూద్ అహ్మదీనెజాద్.. ఇప్పుడు అదే ఇజ్రాయెల్‌తో చేతులు కలిపారన్నది ఈ కథనం సారాంశం. ఇరాన్‌లో ప్రస్తుత ఇస్లామిక్ ప్రభుత్వాన్ని కూలదోసి, ఆ స్థానంలో అహ్మదీనెజాద్‌ను ఇరాన్ అధినేతగా కూర్చోబెట్టేందుకు ఇజ్రాయెల్ ఒక భారీ రహస్య వ్యూహాన్ని రచించినట్లు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ గూఢచారి వర్గాల ఉటంకిస్తూ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ కుట్ర ఇరాన్ నిఘా వర్గాలకు తెలిసిపోవడంతో అహ్మదీనెజాద్‌ను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) గృహనిర్బంధంలో ఉంచినట్లు తెలుస్తోంది.

హంగేరీ వేదికగా రహస్య అడుగులు
ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీతో వచ్చిన విభేదాలు, దేశ పతనంపై ఉన్న అసంతృప్తితోనే అహ్మదీనెజాద్ ఇజ్రాయెల్ ప్రతిపాదనలకు తలొగ్గినట్లు సమాచారం. 2024లో హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లోని లుడోవికా యూనివర్సిటీలో జరిగిన పర్యావరణ సదస్సు కేవలం ఒక ముసుగు మాత్రమేనని, అక్కడే ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ 'మొసాద్' అప్పటి చీఫ్ డేవిడ్ బార్నియా నేరుగా అహ్మదీనెజాద్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారని కథనంలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ అధికారులతో చర్చలు జరిపేందుకు అహ్మదీనెజాద్ ప్రయాణ, వసతి ఖర్చులను కూడా ఇజ్రాయెలే భరించిందని, ఈ విషయాన్ని మొసాద్ సంస్థ అమెరికా సిఐఎకి కూడా చేరవేసిందని సమాచారం.

క్లైమాక్స్ సీన్.. తలకిందులైన ప్లాన్
ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య జరిగిన దాడుల సమయంలో ఈ వ్యూహం పతాక స్థాయికి చేరింది. ఇరాన్‌లోని అహ్మదీనెజాద్ నివాసంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగి ఆయన రక్షణ వాహనాలు ధ్వంసమైన వెంటనే, ఒక నల్లటి ప్యుజో కారు అక్కడికి చేరుకుని ఆయనను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఆ కారును నడిపింది మొసాద్ ఏజెంట్లని సమాచారం. అయితే, ఇజ్రాయెల్ తనను మళ్లీ అధికారంలోకి తెస్తుందనే నమ్మకం సడలడం, ఆ రక్షణ చర్యలపై అనుమానాలు రావడంతో అహ్మదీనెజాద్ ఆ సేఫ్ హౌస్ నుండి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి నుండి ప్రజల కంటపడని ఆయన.. గత వారం దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ మాత్రమే కొద్దిసేపు కనిపించారు.

కరడుగట్టిన నేతలో మార్పు
2005 నుండి 2013 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అహ్మదీనెజాద్ ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. కానీ పదవి నుంచి దిగిపోయాక అవినీతిని వ్యతిరేకిస్తూ తన గొంతు మార్చారు. ప్రస్తుత ఇస్లామిక్ వ్యవస్థ కుప్పకూలితే తాను దేశాన్ని నడిపించగలనని, ట్రంప్ హయాంలో కుదిరిన 'అబ్రహం ఒప్పందాల' తరహాలోనే ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణ స్థితికి తెస్తానని ఆయన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంచలన ఆరోపణలపై అటు ఇరాన్ కానీ, ఇటు ఇజ్రాయెల్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Advertisement
Mahmoud Ahmadinejad
Israel Mossad
Iran Politics
New York Times Report
David Barnea
Iran Israel Conflict

More Telugu News