గంజాయి, అమ్మాయి గొడవ: యువకుడిని కొట్టి చంపిన స్నేహితులు

Nishani Suhas murdered by friends over ganja and girl dispute in Hyderabad
  • హైదరాబాద్ శివార్లలో స్నేహితుల చేతిలో యువకుడి హత్య
  • గంజాయి లావాదేవీలు, అమ్మాయి విషయంలో వివాదం
  • ఇంటి నుంచి పిలిచి నిర్మానుష్య ప్రాంతంలో కిరాతకంగా దాడి
  • కేసు నమోదు చేసిన పోలీసులు, ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ
  • మృతుడు పసుమాముల గ్రామానికి చెందిన సుహాస్‌గా గుర్తింపు
హైదరాబాద్ నగర శివార్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గంజాయి లావాదేవీలు, ఓ యువతి విషయంలో తలెత్తిన వివాదం కారణంగా స్నేహితులే ఓ యువకుడిని కిరాతకంగా కొట్టి చంపారు. హయత్‌నగర్ మండలం పసుమాముల గ్రామంలో ఈ సంఘటన వెలుగుచూసింది.

పోలీసుల కథనం ప్రకారం, పసుమాముల గ్రామానికి చెందిన నిషాని సుహాస్ (22) గంజాయికి బానిసవడంతో పాటు, ఆ వ్యసనం కోసం గంజాయి విక్రయాలకు కూడా పాల్పడేవాడు. ఈ క్రమంలో తన స్నేహితుడి ఫోన్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతికి అసభ్యకర సందేశాలు పంపడం, అనుచితంగా ప్రవర్తించడంతో వివాదం మొదలైంది. ఆ యువతి.. సుహాస్ స్నేహితుల్లో ఒకరికి గాళ్ ఫ్రెండ్. దీనికి తోడు గంజాయి విక్రయాలకు సంబంధించిన పాత నగదు గొడవలు కూడా తోడయ్యాయి.

ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున నిందితులు సుహాస్‌ను ఇంటి నుంచి బయటకు పిలిచారు. గ్రామ శివార్లలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు సుహాస్ సుమారు అర కిలోమీటరు మేర పరుగెత్తినప్పటికీ, నిందితులు వెంబడించి పట్టుకున్నారు. మర్మావయవాలపై సహా శరీరమంతా తీవ్రంగా కొట్టడంతో సుహాస్ మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పెద్ద అంబర్‌పేట్-పసుమాముల రహదారిలోని శ్మశానవాటిక సమీపంలో గల సిమెంట్ బెంచీపై పడేసి వెళ్లారు.

తన కుమారుడిని చెడు అలవాట్ల నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో తల్లి నందిని సికింద్రాబాద్ నుంచి పసుమాములకు నివాసం మార్చారు. అయితే, అంతలోనే ఈ ఘోరం జరగడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Advertisement
Nishani Suhas
Hayathnagar murder case
Hyderabad crime news
Ganja dispute murder
Pasumamula village crime

More Telugu News