ఇంకో కారు కొనడానికి ముద్దు సీన్లలో నటించాలా?: వ్యక్తిగత విలువలపై సాయి పల్లవి వ్యాఖ్యలు
- ముద్దులు, ఇంటిమేట్ సీన్లపై సాయి పల్లవి కీలక వ్యాఖ్యలు
- ముద్దు సీన్లు చేయమని ఎంతో మంది దర్శకులు అడిగారన్న సాయి పల్లవి
- అలాంటి సన్నివేశాల్లో నటించడం తనకు ఇష్టం ఉండదని వెల్లడి
- కథ పరంగా అలాంటి సీన్లు అవసరమైతే వేరే హీరోయిన్లను చూసుకోమని చెబుతానని వెల్లడి
మలయాళ చిత్రం ‘ప్రేమమ్’లో మలర్ పాత్రతో కెరీర్ ప్రారంభించి, శేఖర్ కమ్ముల ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్లో 'లేడీ పవర్ స్టార్'గా గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా దూసుకుపోతున్నా, గ్లామర్ పాత్రలకు, కమర్షియల్ హంగులకు దూరంగా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సినిమాల్లో ముద్దు సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్లపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంటర్వ్యూలో యాంకర్.. "దర్శకులు ఎప్పుడైనా మిమ్మల్ని ముద్దు సన్నివేశాల్లో నటించమని అడిగారా? అలా చేయకూడదని ఎందుకు నిర్ణయించుకున్నారు?" అని ప్రశ్నించగా, సాయి పల్లవి ఎంతో నిజాయతీగా, కుండబద్దలు కొట్టినట్లు సమాధానమిచ్చారు.
"అవును, చాలా మంది దర్శకులు అడిగారు.. ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు. నేను ముద్దు సీన్లు చేయనని తెలిసినా అలాంటి ఆఫర్లు వస్తుంటాయి. ఒకవేళ నాకు ఒక జీవిత భాగస్వామి లేదా బాయ్‌ఫ్రెండ్ ఉంటే, కేవలం నటన కోసమే అయినా నేను ఇంకొకరిని ముద్దు పెట్టుకోవడం నాకు సరైందిగా అనిపించదు.
ఒక మనిషి సంతోషంగా బతకడానికి ఒక మంచి కుటుంబం, ఉండటానికి ఇల్లు, ప్రయాణించడానికి ఒక కారు ఉంటే చాలు. అవన్నీ భగవంతుడి దయ వల్ల నాకు ఇప్పటికే ఉన్నాయి. కేవలం ఇంకో కారు కొనడానికో, లగ్జరీ జీవితం గడపడానికో నా వ్యక్తిగత విలువలను వదులుకుని ఇంకొకరిని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా నటన చూసి మాత్రమే నన్ను సినిమాల్లోకి ఎంపిక చేసుకుంటే చేస్తాను. ఒకవేళ కథకు ముద్దు సీన్లు, ఇంటిమేట్ సన్నివేశాలే ముఖ్యం అనుకుంటే నా స్థానంలో వేరే ఎవరినైనా తీసుకోవచ్చు, అందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు" అని స్పష్టం చేశారు.
సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు, ఆమె అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు. డబ్బు, స్టార్డమ్ కోసం కాకుండా నమ్మిన సిద్ధాంతాలకు, వ్యక్తిగత విలువలకు ప్రాధాన్యత ఇస్తున్న ఆమె వ్యక్తిత్వాన్ని అభినందిస్తూ.. 'దటీజ్ సాయి పల్లవి' అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.