తిరుపతిలో ఘోరం..పెళ్లి వేడుకలో రక్తపాతం.. కల్యాణ మండపం బయట ఇద్దరి దారుణ హత్య

Tirupati horror bloodshed at wedding ceremony as two murdered outside marriage hall
  • తిరుపతిలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపం వద్ద ఘటన
  • దాడిలో మునిరత్నం, మణికంఠ మృతి
  • భార్యను వదిలేసి తిరుగుతున్న అల్లుడు సునీల్‌
  • కల్యాణ మండపంలో నిలదీసినందుకు దాడి
  • వివాహం జరుగుతుండగా మండపం బయట నెత్తురోడిన రహదారి 
  • నిందితులను అదుపులోకి తీసుకున్న తిరుపతి పోలీసులు
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో దారుణం జరిగింది. లక్ష్మీపురం సర్కిల్ సమీపంలో ఉన్న టీటీడీ శ్రీ పద్మావతి కళ్యాణ మండపం వద్ద కుటుంబ వివాదం కారణంగా ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. మృతులను మునిరత్నం (50), మణికంఠ (42)లుగా పోలీసులు గుర్తించారు. కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి పెళ్లి వేడుక జరుగుతుండగా బయట ఈ ఘాతుకం చోటుచేసుకోవడంతో వివాహానికి వచ్చిన అతిథులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.  

పోలీసుల కథనం ప్రకారం.. ఈ హింసాత్మక ఘటనకు కుటుంబ, వివాహ వివాదాలే కారణమని తెలుస్తోంది. సంపూర్ణమ్మ అనే మహిళ కుమార్తెను సునీల్ వివాహం చేసుకున్నాడు. అయితే గత కొన్ని నెలలుగా ఆమెను వదిలేసి సునీల్ విడిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి పద్మావతి కల్యాణ మండపంలో జరుగుతున్న ఒక పెళ్లికి సునీల్ వస్తున్నాడనే విషయం సంపూర్ణమ్మకు తెలిసింది. దీంతో ఆమె తన కుమార్తె వివాహాన్ని దగ్గరుండి జరిపించిన మునిరత్నం, అతడి స్నేహితుడు మణికంఠలకు ఈ విషయాన్ని చేరవేసింది. భార్యను వదిలేసి తిరుగుతున్నాడనే విషయమై సునీల్‌ను నిలదీసేందుకు వారిద్దరూ కల్యాణ మండపానికి చేరుకున్నారు.

కల్యాణ మండపం బయట మునిరత్నం, మణికంఠలు సునీల్‌ను అడ్డుకుని గట్టిగా నిలదీశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అంతలోనే అక్కడకు చేరుకున్న సునీల్ సోదరుడు, ఇతర బంధువులు కూడా గొడవకు దిగారు. వివాదం కాస్తా ముదరడంతో, సునీల్, అతడి బంధువులు కలిసి తమ వద్ద ఉన్న కత్తులతో మునిరత్నం, మణికంఠలపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో మునిరత్నం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మణికంఠను ప్రభుత్వ రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. అనంతరం నిందితులు బైక్‌పై అక్కడి నుండి పరారయ్యారు.

ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం, సీఐ శ్రీనివాసులు, వెస్ట్ సీఐ రామకృష్ణలు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, నిందితులు యర్పేడు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. వారు తిరుపతి విడిచి పారిపోయేలోపే పోలీసులు అప్రమత్తమై నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సంపూర్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ జంట హత్యలకు గల పూర్తి కారణాలపై నిందితులను విచారిస్తున్నారు.
Advertisement
Tirupati double murder
Muniratnam Manikanta
Padmavathi Kalyanamandapam
Tirupati crime news
Family dispute killing
Andhra Pradesh crime

More Telugu News