నీవు లేకుండా జీవితం మునుపటిలా ఉండదు!: ఆఫ్ఘన్ మాజీ క్రికెటర్‌కు నివాళులర్పించిన క్రికెటర్లు

Life will not be the same without you Cricketers pay tribute to Afghan cricketer
  • అరుదైన వ్యాధితో ఆఫ్ఘనిస్థాన్ మాజీ పేసర్ షాపూర్ జద్రాన్ మృతి
  • ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 38 ఏళ్లకే కన్నుమూత
  • అతడి మృతిపై రషీద్ ఖాన్, నబీ, రవిశాస్త్రి భావోద్వేగ నివాళి
ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (38) కన్నుమూశాడు. కొంతకాలంగా 'హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టయోసైటోసిస్' అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న జద్రాన్, ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. బుధవారం తన 39వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన తరుణంలో, ఒక రోజు ముందే ఆయన మరణించడం క్రికెట్ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన షాపూర్, ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న తొలినాళ్లలో జట్టుకు మూలస్తంభంగా నిలిచాడు. 2009 నుంచి 2020 మధ్య కాలంలో అతడు 44 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ముఖ్యంగా, 2015 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌పై ఆఫ్ఘనిస్థాన్ చారిత్రాత్మక తొలి విజయం సాధించడంలో జద్రాన్ కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టడమే కాకుండా, చివర్లో జట్టును విజయతీరాలకు చేర్చే కీలక పరుగులు కూడా సాధించాడు.

షాపూర్ మృతి పట్ల ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. అతడి మరణవార్త తెలుసుకున్న రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ వంటి సహచర ఆటగాళ్లతో పాటు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆయనకు ఘన నివాళులర్పించారు. "ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన ముఖ్య శిల్పుల్లో షాపూర్ ఒకరు. అతడి సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం" అని రవిశాస్త్రి కొనియాడాడు.

"భారమైన హృదయంతో నా ప్రియ మిత్రుడికి వీడ్కోలు పలుకుతున్నాను" అంటూ రషీద్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. జద్రాన్ నిత్యం చిరునవ్వుతో ఉండేవాడని, అందరిపట్ల ఎంతో ఆప్యాయత కనబరిచేవాడని గుర్తు చేసుకున్నాడు. "నువ్వు లేని ఈ జీవితం ఇది వరకు లాగా ఉండదు.  నా హృదయంలో నీకు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. మిత్రమా విశ్రాంతి తీసుకో" అని రషీద్ పేర్కొన్నాడు.

"సోదరా, దేవుడు నీపై అపారమైన ప్రేమను చూపి స్వర్గప్రాప్తిని కలిగించాలని ప్రార్థిస్తున్నాను. ఈ పుట్టేడు దుఃఖాన్ని తట్టుకునే శక్తిని నీ కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు కేవలం ఆప్తమిత్రుడివి మాత్రమే కాదు, మాతృభూమికి నిజమైన సేవకుడివి"  అని ఆఫ్ఘనిస్థాన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ నబీ నివాళులర్పించాడు. జద్రాన్ మరణం అతడి కుటుంబానికే కాకుండా దేశానికి కూడా తీరని లోటు అని ఆల్‌రౌండర్ అజ్మతుల్లా పేర్కొన్నాడు.
Advertisement
Shapoor Zadran
Afghanistan Cricket
Rashid Khan
Mohammad Nabi
Shapoor Zadran Death
Hemophagocytic Lymphohistiocytosis

More Telugu News