Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నదిని పెళ్లి చేసుకున్న బ్రిటన్ యువతి.. ఇప్పుడు హక్కుల కోసం పోరాటం!

British woman who married a river is now fighting for its rights
Advertisement
  • ఏవాన్ నదిని వివాహం చేసుకున్న మెగ్ అనే మహిళ 
  • నదికి చట్టపరమైన హక్కుల కోసం కొత్త ఉద్యమం
  • 'జీవించే అస్తిత్వం'గా గుర్తించాలని డిమాండ్
  • నాలుగు కౌన్సిళ్లతో కలిసి ప్రత్యేక చార్టర్ రూపకల్పన
  • గణాంకాలకు బదులు భావోద్వేగ బంధంతో మార్పునకు యత్నం
Advertisement
ప్రకృతిని కాపాడటానికి ఎన్నో ఉద్యమాలు జరుగుతుంటాయి. కానీ, బ్రిటన్‌కు చెందిన ఓ యువతి ఏకంగా నదినే పెళ్లి చేసుకుని, ఇప్పుడు దాని హక్కుల కోసం న్యాయపోరాటానికి సిద్ధమైంది. యూకేలోని జలవనరుల్లోకి శుద్ధి చేయని మురుగునీటిని వదులుతున్నారనే ఆవేదనతో, ఏవాన్ నది దుస్థితిని ప్రపంచానికి తెలియజేయడానికి 2023లో మెగ్ అనే 28 ఏళ్ల యువతి ఆ నదిని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి తన పేరును 'మెగ్ ఏవాన్'గా మార్చుకుని, ఆ నదికి తాను భార్యనంటూ ప్రచారం చేస్తోంది. ఇప్పుడు తన పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఏవాన్ నదికి చట్టపరమైన హక్కులు కల్పించడమే లక్ష్యంగా ఓ వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టింద.

ఈ లక్ష్య సాధన కోసం మెగ్ ఏవాన్, యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ (UWE) పరిశోధకులతో కలిసి పనిచేస్తోంది. ముఖ్యంగా న్యాయశాస్త్ర పరిశోధకురాలు ఎలెనా బ్లాంకో సహకారంతో నదికి చట్టపరమైన రక్షణ కల్పించే మార్గాలను అన్వేషిస్తోంది. 

ఇందులో భాగంగా, యూకేలోనే తొలిసారిగా ఒక నది కోసం 'క్రాస్-కౌన్సిల్ రివర్ చార్టర్'ను రూపొందిస్తున్నారు. నార్త్ విల్ట్‌షైర్, బాత్ అండ్ నార్త్ ఈస్ట్ సోమర్‌సెట్, బ్రిస్టల్ సిటీ, సౌత్ గ్లౌసెస్టర్‌షైర్ కౌన్సిళ్లను ఈ ప్రయత్నంలో భాగం చేస్తున్నారు. ఏవాన్ నదిని ఓ 'జీవించే అస్తిత్వం'గా (living entity) అధికారికంగా ప్రకటించి, దానికి చట్టపరమైన హక్కులు కల్పించడమే ఈ చార్టర్ ముఖ్య ఉద్దేశం.

ఈ ఉద్యమం వెనుక ఉన్న ఆలోచన కేవలం గణాంకాలు, డేటాతో ప్రజలను చైతన్యపరచడం కాదు. నదులతో మానవాళికి ఉన్న భావోద్వేగ బంధాన్ని గుర్తుచేయడం ద్వారా వారిలో మార్పు తీసుకురావడం. 

"కథలు మానవ స్థాయిలో మార్పును తెస్తాయి" అని పరిశోధకురాలు ఎలెనా బ్లాంకో వివరిస్తున్నారు. మెగ్ తనను తాను 'నది భార్య'గా అభివర్ణించుకోవడం ఈ కథనానికి ఆయువుపట్టుగా మారింది. ఈ విధానం ప్రజలను ఆకట్టుకోవడమే కాకుండా, చర్చను మరింత సున్నితంగా, నిర్మాణాత్మకంగా మార్చడానికి దోహదపడుతోంది.

ఇటీవల యూకేలోని వై నదికి ఇలాంటి హక్కులే కల్పించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఏవాన్ నది హక్కుల కోసం పోరాడుతోంది. ఈ ఉద్యమంలో డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ షార్లెట్ సాయర్ వంటి వారు కూడా పాలుపంచుకుంటున్నారు. నదిని కలుషితం చేస్తున్నారనే ఆవేదనతో పాటు, ఆ నదితో స్థానిక సమాజానికి ఉన్న ప్రేమ, అనుబంధాన్ని కూడా వారు తమ కథనాల ద్వారా వెలుగులోకి తెస్తున్నారు. 

ఏవాన్ నదితో తనకు ఆధ్యాత్మిక బంధం ఉందని చెప్పే మెగ్, ఒకవేళ నదికి చట్టపరమైన హక్కులు లభిస్తే మళ్లీ పెళ్లి చేసుకుంటానని, నది తరఫున ఒక ప్రతినిధిగా ఎల్లప్పుడూ నిలబడతానని స్పష్టం చేసింది. ఈ 'రైట్స్ ఆఫ్ నేచర్' ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు కొత్త దారులు చూపుతోంది.
Advertisement
Advertisement
Meg Avon
River Avon
UK river pollution
Rights of Nature
Environmental protection
River Charter

More Telugu News